రాష్ట్రంలో పండుగ వాతావరణం లేదు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడ బీసెంట్‌రోడ్డులో మూడురోజులపాటు జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున భోగి వేడుకలను ఆయన ప్రారంభించారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏటా బీసెంట్ రోడ్డులో భోగి వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ‘సంక్రాంతి’ అనేది కోటి కాంతులతో అన్నదాతలు పండుగను జరుపుకుంటారని మల్లాది విష్ణు తెలిపారు. కూటమి పాలనలో రైతులకు మద్దతు ధర లేదని చెప్పారు.
సంక్షేమ పథకాలు లేవు
తల్లికి వందనం, రైతులకు రూ.20 వేలు వంటి పథకాలు ఇవ్వడం లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో పండగ సమయానికి ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యేవని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే సమయానికి రైతన్నలకు ఖరీఫ్ పంట డబ్బులు చేతికొచ్చాయని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్నికల హామీలను నెరవేర్చాలని లేకపోతే ప్రజాగ్రహానికి చూడక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వెన్నం రత్నారావు, చల్లా సుధాకర్, అంజిబాబు, యరగొర్ల శ్రీరాములు, మురళీకృష్ణంరాజు, కొండా మహేశ్వర్‌రెడ్డి, కోలా నాగాంజనేయులు, తోపుల వరలక్ష్మి, త్రివేణి రెడ్డి, యక్కల మారుతీ, కగ్గా పాండు, ఫాతిమా, వీరబాబు, జగదీష్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
నేడు అయ్యప్ప గుడిలో జ్యోతి దర్శనం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు ఆలయంపైన జ్యోతి దర్శనం జరుగుతుంది. మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజామున 4.45 గంటలకు స్వామివారి దర్శనం, గణపతి హోమం, గోపూజ జరగనున్నాయి. అనంతరం 5.15 గంటలకు స్వామివారికి మహాభిషేకం, సువర్ణ కవచం ఊరేగింపు, 5.30కి స్వామివారికి స్వర్ణ కవచం సమర్పణ, 5.45కు ఉషఃపూజ, సువర్ణ కవచాలంకరణతో అయ్యప్ప స్వామి దివ్య దర్శనం, 6.15కి శ్రీవేలి, 6.45కి సువర్ణ కవచానికి లక్ష రూపాయలకుపైబడి విరాళం ఇచ్చిన దాతలకు సన్మానం చేస్తారు. అనంతరం 7.30 నుంచి 11 గంటల వరకు స్వామివారికి భక్తుల నెయ్యాభిషేకాలు, 12 గంటలకు మధ్యాహ్న పూజ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు స్వామివారి సువర్ణ కవచ విశేషాలంకార దర్శనం, 5.45కు శ్రీవేలి, 6.30 గంటలకు మహా దీపారాధన, అనంతరం 6.40 గంటలకు జ్యోతి దర్శనం కల్పించనున్నట్లు అయ్యప్ప దేవస్థానం ట్రస్ట్ సభ్యులు ఒక ప్రకటనలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment