సంక్రాంతికి చంద్రన్న సరుకులేవి?
గుడ్లవల్లేరు: సంక్రాంతికి చంద్రబాబు తన గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన చంద్రన్న సరుకులు ఈ సారి కూటమి వచ్చాక లేకుండా పోయాయి. క్రిస్మస్‌కు కూడా చంద్రన్న కానుకలు ఇవ్వలేకపోయారు. జిల్లాలో 5.33 లక్షల తెల్ల రేషను కార్డుదారులు చంద్రన్న కానుకలకు అర్హులే. నానాటికీ ఆకాశన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కొనే పరిస్థితి లేకుండా పోయింది. సంక్రాంతికి ఎలాంటి కానుకల పంపిణీ లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై పేద ప్రజలు పెదవి విరుస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ హయాంలో పేద వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వారి బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ పథకాల్లో వేసే నగదుతో తమ జీవితాల్లో సంక్రాంతి శోభిల్లేదని గుర్తు చేసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు అన్ని పండుగలను అంగరంగ వైభవంగా చేసుకునేవారంటున్నారు. పేదల జీవితాల్లో సంక్రాంతి ఈ ప్రభుత్వ పాలనలో కొరవడిందని వాపోతున్నారు.
కనీసం రేషను సరుకుల్లో కనిపించని పండుగ
నెల నెలా ఇచ్చే రేషను సరుకుల్లో పిండి వంటలు చేసుకునేందుకు ఎలాంటి సరుకులు కూడా కూటమి ప్రభుత్వం అందించకపోవడంతో ప్రభుత్వంపై పేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేషను బియ్యంతో పాటు కనీసం పామాయిల్ అయినా ఇస్తే సరిపోయేదంటున్నారు. కందిపప్పు కూడా అన్ని కార్డుదారులకు ఇవ్వలేదని వాపోతున్నారు.
పంచదార కొన్ని ప్రాంతాల్లో నీరు పట్టి నాసిరకంగా ఉండటంతో అది కూడా తీసుకోలేదని చెబుతున్నారు. వైపరీత్యాలతో పంటలు సరిగా పండక ఇబ్బందుల్లో ఉన్న పేదలపై ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని వాపోతున్నారు. చంద్రన్న కానుకలను గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరి కూటమి పాలనలో అందిస్తే...బాగుండేదంటున్నారు. చంద్రన్న కానుకల విషయంలో అలాంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడలేదని అధికారులు చెబుతున్నారు.
క్రిస్మస్‌కు లేని కానుకలు
కూటమి పాలనపై పెదవి విరుస్తున్న పేదలు
జిల్లాలో 5.33లక్షల రేషన్ కార్డుదారులు
Comments
Please login to add a commentAdd a comment