జీజీహెచ్‌లో నిలిచిన వైద్యసేవలు
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులపాలు కావాల్సి వస్తోంది. వివిధ రకాల దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల సదరం ధ్రువీకరణ పత్రాలను రీ–వెరిఫికేషన్ చేసేందుకు జీజీహెచ్‌లో పనిచేస్తున్న నలుగురు కీలక వైద్యులను ఇతర ప్రాంతాలకు నియమిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి సూచించిన ప్రాంతాలకు సోమవారమే వెళ్లి విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొనటంతో నలుగురు వైద్యులు ఆస్పత్రిలో వైద్యసేవలను పక్కనపెట్టి పయనమయ్యారు. దీంతో ఈ విభాగాల్లో వైద్యసేవల్లో నిలిచిపోయాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు పడిగాపులు పడి నిరాశతో వెనుతిరిగారు.
ఇతర ప్రాంతాల విధులకు వెళ్లిన వైద్యులు
జీజీహెచ్‌లోని నేత్ర విభాగంలో పనిచేస్తున్న విభాగాధిపతి జి.భానుమూర్తి నూజివీడుకు, డాక్టర్ అమృత ఏలూరుకు, ఈఎన్‌టీ విభాగాధిపతి సి.అనిత విజయవాడకు, మానసిక వైద్యుడు నిరంజన్‌కుమార్ కాకినాడకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాల మేరకు సోమవారమే హుటాహుటిన విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వటంతో వైద్యులు నలుగురు వెళ్లారు. నలుగురు వైద్యులు సదరం సర్టిఫికెట్ల రీ–వెరిఫికేషన్ విధులకు వెళ్లటంతో ఆయా విభాగాల్లో వైద్యసేవలు నిలిచిపోయాయి. ఈ వైద్యసేవలు వచ్చే మే వరకు కూడా కొనసాగే పరిస్థితి లేదు. దీంతో జీజీహెచ్‌లో ఈ విభాగాలు మూతపడనున్నాయి. ఆస్పత్రికి ఈ విభాగాల్లో వైద్యం కోసం వచ్చే వారు వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
రోగుల అవస్థలు వర్ణనాతీతం..
నేత్ర విభాగంలో శస్త్రచికిత్సల కోసం సోమవారం 20 మంది రోగులు వచ్చారు. వీరికి ఉదయం శస్త్రచికిత్సలకు సంబంధించి ముందస్తు పరీక్షలు సైతం నిర్వహించారు. వైద్యుడు భానుమూర్తి శస్త్రచికిత్సలు చేసేందుకు ఉపక్రమించే సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డి.ఆషాలత నుంచి ఈ ఆదేశాలు అందాయి. దీంతో హుటాహుటిన సదరు విధులకు హాజరయ్యేందుకు వెళ్లారు. నేత్ర శస్త్రచికిత్సలు నిలిచిపోవటంతో రోగులు నిరాశతో వెనుతిరిగారు. అలాగే నేత్ర, ఈఎన్‌టీ విభాగాల ఓ.పి.ల వద్దకు వైద్యసేవల కోసం వచ్చిన రోగులు సైతం నిరాశతో వెళ్లాల్సి వచ్చింది. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
మూడు నెలలుగా తిరుగుతున్నా..
కంటి శస్త్రచికిత్స కోసం ఆస్పత్రికి మూడు నెలలుగా తిరుగుతున్నాను. శనివారం వచ్చి అడిగితే మళ్లీ వాయిదా వేశారు. ఇంటికి వెళ్లిన తరువాత ఫోన్ చేసి సోమవారం రమ్మన్నారు. ఉదయం 7 గంటల కల్లా వచ్చాను. వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తారని చూస్తున్న సమయంలో నర్సు వచ్చి డాక్టర్ రావటం లేదు. వేరే డ్యూటీ పడిందని చెప్పి వెళ్లిపోమన్నారు.
– తలుపుల శ్రీనివాసరావు, భోగిరెడ్డిపల్లి
ఆపరేషన్ చేస్తామంటే వచ్చాను..
గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా జరగలేదు. గతంలో ఒక కంటికి ఈ ఆస్పత్రిలోనే ఆపరేషన్ చేయించుకున్నాను. మరో కంటికి చేయించుకునేందుకు రెండు నెలలుగా తిరుగుతున్నాను. సోమవారం ఆపరేషన్ చేస్తామంటే వచ్చాను. ఇంతలోనే డాక్టర్ లేరు వేరే డ్యూటీకి వెళ్లారని చెప్పారు. ఇలా అయితే ఎలా.. పేద రోగులకు ఈ ప్రభుత్వంలో ఇచ్చే మర్యాద ఇదేనా.
– జి.వెంకటేశ్వరమ్మ, జీలగలగండి
సదరం రీ–వెరిఫికేషన్ విధుల్లోకి మచిలీపట్నం వైద్యులు
ఇతర ప్రాంతాల్లో విధులకు
నలుగురు వైద్యులు
ఐదు నెలల పాటు నాలుగు విభాగాల్లో నిలిచిపోనున్న సేవలు
నేత్ర శస్త్రచికిత్సల కోసం
క్యూ కట్టిన రోగులు
Comments
Please login to add a commentAdd a comment