నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను నిష్ఫక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. శనివారం సాయంత్రం తన ఛాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఈ నెల మూడో తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని, పదో వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చని పేర్కొన్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉదయం ఎని మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్, మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపు మొదలవుతుందని వివరించారు. మార్చి ఎనిమిదో తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. అప్పటివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని, రాజకీయ పార్టీలు తప్పకుండా పాటించాలని సూచించారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో 35,343 మంది పురుషులు, 27,796 మంది మహిళలు, నలుగురు ఇతర ఓటర్లు కలిపి మొత్తం 63,143 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చే ఫారం–18లను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ముసాయిదా జాబితా ప్రకారం 76 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వెల్లడించారు. గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 23, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 28, ఉయ్యూరు డివిజన్ పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. వీటికి అదనంగా సహాయ పోలింగ్ కేంద్రం కోసం ఒకదానిని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సందర్భంగా కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ ఆర్‌సీ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, గుడివాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ల అధికారులు జి.బాలసుబ్రమణ్యం, కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment