నేటి నుంచి కార్తికేయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. వేదపండితులు కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ నేతృత్వంలో భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధి కారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు శనివారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో, వెలుపల చలువ పందిళ్లు వేశామన్నారు. నాలుగో తేదీ రాత్రి జరిగే రథోత్సవం, ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుష్కరిణిలో నిర్వహించే శ్రీస్వామివారి తెప్పోత్సవానికి ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు.
రేపు సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మాఘ శుద్ధ పంచమి (శ్రీపంచమి)ని పురస్కరించుకుని ఈ నెల మూడో తేదీన ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని మూలవిరాట్‌తో పాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని విశేషంగా అలంకరిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వ హించి విద్యార్థులకు పంపిణీ చేసే పెన్నులు, కంకణాలను ఆలయ మూలవిరాట్ చెంత ఉంచుతారు. దేవస్థానం యాగశాలలో సరస్వతీ యాగాన్ని నిర్వహించేందుకు వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది. మూడో తేదీ ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించి, పెన్నులు అందజేస్తారు. విద్యార్థులు స్కూల్, కాలేజీ యూనిఫాం ధరించి గుర్తింపు కార్డును తీసుకురావాలని ఆలయ అధికారులు సూచించారు. పెన్నుతో పాటు అమ్మవారి రక్ష కంకణం, పాకెట్ సైజు ఫొటో, ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీకి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సుమారు 40 వేల మంది విద్యార్థులు ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేసి, ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
పెనమలూరు: విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయాలని వన్‌మెన్ కమిషన్ చైర్మన్ రాజీవ్‌రంజన్‌మిశ్రా సూచించారు. ఆయన శనివారం పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని పాఠశాలలో ఉన్న వనరులను సమరంగా ఉపయోగించుకుని విద్యార్థులకు పాఠాలు చెప్పాలన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ వి.విజయరామరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్డీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి, పాఠశాలల పరీక్షల విభాగం డైరెక్టర్ కె.శ్రీనివాసరెడ్డి, పాఠశాల టెక్ట్స్ బుక్స్ డైరెక్టర్ డి.మధుసూదనరావు, కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి పి.వి.జె.రామారావు, ఉప విద్యాశాఖ అధికారి ఐ.పద్మారాణి, హెచ్‌ఎం వై.దుర్గాభవాని, ఎస్‌ఎంసీ చైర్మన్ కై రున్‌బీ పాల్గొన్నారు.
సజావుగా సామాజిక పింఛన్‌లు పంపిణీ
ఇబ్రహీంపట్నం/కంచికచర్ల: రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని పటిష్ట పర్యవేక్షణతో సామాజిక పింఛన్ల పంపిణీని చేపట్టామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. పింఛన్ల పంపిణీలో భాగంగా కంచికచర్ల మండలంలోని పరిటాల, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో కలెక్టర్ శనివారం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. తొలి రోజు జిల్లాలో 2,29,913 మంది లబ్ధిదారులకు రూ.98.20 కోటు పంపిణీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment