సదా సన్నుతి | - | Sakshi
Sakshi News home page

సదా సన్నుతి

Published Mon, Feb 10 2025 12:56 AM | Last Updated on Mon, Feb 10 2025 12:56 AM

సదా స

సదా సన్నుతి

ఆవే మరియా.. వందనం
వైభవంగా మేరీమాత ఉత్సవాలు ఆరంభం

బిషప్‌ గ్రాసీ ప్రాంగణంలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్న మఠకన్యలు, విశ్వాసులు

గుణదల(విజయవాడ తూర్పు): కై స్తవ ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతున్న గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొండ దిగువన ఉన్న బిషప్‌ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై విజయవాడ కథోలిక పీఠం బిషప్‌ తెలగతోటి రాజారావు, మోన్సిగ్నోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌, పుణ్యక్షేత్రం రెక్టర్‌ ఫాదర్‌ యేలేటి విలియం జయరాజు తదితర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్‌ రాజారావు భక్తులకు దైవ సందేశాన్ని అందిస్తూ, పోప్‌ ఫ్రాన్సిస్‌ జగద్గురువులు 2025 సంవత్సరాన్ని జూబ్లీ సంవత్సరంగా ప్రకటించారన్నారు. మరియమాతను ఆశ్రయించడం ద్వారా మన కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు చేకూరుతాయని పేర్కొన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం అద్భుతాలకు నెలవుగా నిలిచిందన్నారు. లక్షలాది మంది భక్తులు మరియతల్లిని దర్శించుకుని మేలులు పొందుతున్నారని తెలిపారు.

దేవునికి అసాధ్యమేమి లేదు..

అనంతరం స్వర్ణ జుబిలేరియన్‌ ఫాదర్‌ పీకే జోసఫ్‌ దైవ సందేశాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్నారు. ఆయనను విశ్వసించిన భక్తుల జీవితాలలో శాంతి సమాధానాలు నెలుకొంటాయని పేర్కొన్నారు. బైబిల్‌ గ్రంథం ప్రకారం కానాను పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు చేసిన అద్భుతాన్ని గుర్తు చేశారు. లోక రక్షకుడైన క్రీస్తును ఈ లోకానికి అందించిన మరియతల్లి సర్వజనుల మాతగా నిలిచిందన్నారు. దేవుడు మనకు తెలియపరిచిన నియమాలను ఆచరించి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పూజా పీఠంపై విజయవాడ బిషప్‌ రాజారావు, వికార్‌ జనరల్‌ ఫాదర్‌ ఎం. గాబ్రియేలు, పుణ్యక్షేత్ర రెక్టర్‌ ఫాదర్‌ యేలేటి విలియం జయరాజు, ఎడ్యుకేషన్‌ డెస్క్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ కొలకాని మరియన్న, సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ సునీల్‌రాజు కలసి ప్రారంభ సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు.

భక్తులతో పోటెత్తిన కొండ..

ఉత్సవాల తొలిరోజైన ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు లక్షలాదిగా పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. మరియ తల్లిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. దీంతో గుణదల కొండ యాత్రికులతో నిండి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ గురువులు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు.

పటిష్ట బందోబస్తు: సీపీ రాజశేఖరబాబు

విజయవాడస్పోర్ట్స్‌: గుణదల మేరీమాత ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఉత్సవాలకు ఏర్పాటు చేసిన బందోబస్తును కమిషనర్‌ ఆదివారం పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మేరీ మాత ఆలయం సమీపంలో మినీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించాలని, భక్తులందరికీ ఇబ్బందులు లేని ప్రశాంతమైన వాతావరణంలో మెరుగైన సేవలు అందించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. డీసీపీ గౌతమి సాలి, ట్రైనీ ఐపీఎస్‌ మనీషా పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఊరేగింపు

మనుజాలిలో మాన్యురాలు.. పరలోక దూతలే దిగివచ్చి పొగడిన పరిశుద్ధురాలు.. లోక రక్షకుడికే తల్లియైన మరియమాతా.. నీవే మా ఆశ.. నీవే ధైర్యం.. నీవే మా దీవెన.. అంటూ భక్తలోకం ప్రార్థించింది.. నీవంటే అనురాగం.. నీవంటే అనుబంధం.. నీవంటే సహాయం.. మా కష్టాలను ఎరిగిన తల్లీ.. మాకై నిరతం ప్రార్థించమ్మా అంటూ వేడుకుంది. ఆదివారం గుణదల మేరీమాత తిరునాళ్ల వైభవంగా ప్రారంభమైంది. ప్రశస్తమైన ఆ మాత ఒడిలో సాంత్వన పొందేందుకు క్రైస్తవ లోకం పోటీ పడింది. ప్రార్థనలు, మొక్కుబడులు.. ఉదయం, సాయంత్రం వేళల్లో గురువుల సమష్టి దివ్యపూజా బలి, ఉత్సాహపరిచే పాటలు, నాటికలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించాయి.

జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన గురువులు లక్షలాదిగా చేరుకుంటున్న యాత్రికులు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న గుణదల పుణ్యక్షేత్రం

గుణదల(విజయవాడ తూర్పు): లోకమాతగా కీర్తి గాంచిన మేరీమాత కృపా వీక్షణ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించాలని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్నారు. గుణదల ఉత్సవాల తొలిరోజు ఆదివారం మధ్యాహ్నం మేరీమాత విగ్రహం ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ మరియమాత స్వరూపాన్ని ఉంచిన పల్లకీ పట్టుకుని పురవీధులలో తిరిగారు. ఆయన మాట్లాడుతూ మరియతల్లిని ఆశ్రయించిన భక్తులకు సకల ఆశీర్వాదాలు లభిస్తాయన్నారు. మరియతల్లి సేవలో తాను పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి దేవినేని రాజశేఖర్‌ నెహ్రూ మరియతల్లిని సేవించేవారని గుర్తు చేశారు. మరియమ్మ దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. అనంతరం మేరీమాత స్వరూపాన్ని గుణదల పురవీధులలో ఊరేగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సదా సన్నుతి 1
1/5

సదా సన్నుతి

సదా సన్నుతి 2
2/5

సదా సన్నుతి

సదా సన్నుతి 3
3/5

సదా సన్నుతి

సదా సన్నుతి 4
4/5

సదా సన్నుతి

సదా సన్నుతి 5
5/5

సదా సన్నుతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement