![నేత్ర](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09pnm01aaa-310164_mr-1739129118-0.jpg.webp?itok=CNOSM3ba)
నేత్రపర్వం.. ఊయల ఉత్సవం
ఉయ్యూరు: వీరమ్మతల్లి ఊయల ఉత్సవం నేత్ర పర్వంగా సాగింది. భక్తజన కోలాహలం నడుమ కనక చింతయ్య సమేతంగా అమ్మవారు పల్లకీలో ఊరేగి ఊయల స్తంభం వద్దకు చేరుకుని ఊయలలూగారు. అశేష భక్తజనం ఊయల ఉత్సవాన్ని కనులారా వీక్షించి తన్మయం చెందారు. ఊయల ఉత్సవం అనంతరం అమ్మవారు ఆలయ ప్రవేశం చేసి తిరుగుడు గండ దీప భక్తుల తొలి పూజలందుకున్నారు.
అడుగడుగునా నీరాజనాలు..
శనివారం రాత్రి మెట్టినింటి నుంచి బయలుదేరిన వీరమ్మతల్లి పల్లకీలో పట్టణం నలుమూలలా ఊరేగింపుగా వెళ్లి భక్తుల పూజలందుకున్నారు. ఇంటింటా చల్లని తల్లికి చీర సారె, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని ప్రధాన సెంటర్‌లో గల ఊయల స్తంభం వద్దకు చేరుకున్న అమ్మవారికి సంప్రదాయం ప్రకారం ఊయల ఉత్సవం జరిపించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు అమ్మవారికి ఊయల ఉత్సవాన్ని నిర్వహించి చల్లని తల్లికి పూజలు చేయించారు. ఈ సందర్భంగా కొమ్ముబూరలతో, మేళతాళాలతో చేసిన వాయిద్యాల నడుమ అమ్మవారు ఊయలలూగారు. భక్తజనం భక్తపారవశ్యం చెందుతూ జై వీరమ్మ.. చల్లని తల్లి.. కాపాడమ్మా.. అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఊయల ఉత్సవం ముగియటంతో తిరుగుడు గండ దీప భక్తులు వెంట రాగా కల్పవల్లి వీరమ్మతల్లి ఆలయ ప్రవేశం చేశారు.
నేటి నుంచి సాధారణ భక్తులకు..
అమ్మవారి పల్లకీని అగ్నిగుండ ప్రవేశం చేసి, ఆలయ ప్రదేశానికి చేర్చిన వెంటనే భక్తులు తిరుగుడు గండ దీపాలను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుని ఉపవాస దీక్షను విరమించారు. సోమవారం నుంచి అమ్మవారు సాధారణ భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకోనున్నారు.
భక్తజనంతో కిక్కిరిసిన ఉయ్యూరు
అట్టహాసంగా గ్రామోత్సవం
ఆలయ ప్రవేశం చేసిన వీరమ్మతల్లి
![నేత్రపర్వం.. ఊయల ఉత్సవం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09pnm03bbb-310164_mr-1739129118-1.jpg)
నేత్రపర్వం.. ఊయల ఉత్సవం
Comments
Please login to add a commentAdd a comment