వృద్ధునికి అరుదైన కంటి ఆపరేషన్
● గ్లకోమాకు వాల్వ్ ఇన్‌ప్లాంటేషన్ చికిత్స
కర్నూలు(హాస్పిటల్): స్థానిక బుధవారపేటలోని సుశీల నేత్రాలయం డాక్టర్లు ఓ వృద్ధునికి అరుదైన కంటి శస్త్రచికిత్స నిర్వహించి చూపు ప్రసాదించారు. మంగళవారం ఆస్పత్రిలో సీఈఓ డాక్టర్ పి.సుధాకర్‌రావు వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన గోవిందప్ప(70) గతంలో ఆలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేసి పదవీ విరమణ చెందారు. ఆయనకు కుడికన్ను చూపు చిన్నతనం నుంచి దెబ్బతింటూ పోయింది. ఎడమ కన్నుకు కాటరాక్టు రావడంతో 2022లో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత అదే కంటికి గ్లకోమా రావడంతో మందులు వాడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఉన్న చూపు కూడా పోవడంతో చికిత్స నిమిత్తం సుశీల నేత్రాలయ ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు అతన్ని పరిశీలించి గత నెల 23న కార్నియా మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇదే సమయంలో నీటి శుక్లాల వల్ల చూపు 80 నుంచి 90 శాతం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఈ నెల 18న అత్యాధునిక గ్లకోమా వాల్వ్ ఇన్‌ప్లాంటేషన్ పద్ధతిలో శస్త్రచికిత్స చేసి చూపును కాపాడారు. ఇతనికి ఈహెచ్‌ఎస్ పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించినట్లు తెలిపారు. కార్నియా మార్పిడి ఆపరేషన్‌ను డాక్టర్ ఎస్. ఈశ్వర్, గ్లకోమా వాల్వ్ ఇన్‌ప్లాంటేషన్‌ను డాక్టర్ విజయలక్ష్మి నిర్వహించినట్లు డాక్టర్ సుధాకర్‌రావు వివరించారు. సమావేశంలో గైనకాలజిస్టు డాక్టర్ సావిత్రి, రెటీనా స్పెషలిస్టు డాక్టర్ నేహ సుధాకర్, గ్లకోమా స్పెషలిస్టు డాక్టర్ నేహ ఘోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment