నేటి నుంచి అందుబాటులోకి మరళీ రీచ్
కర్నూలు న్యూసిటీ: కౌతాళం మండలం పరిధిలోని మరళీ– 1 ఇసుక రీచ్ గురువారం నుంచి అందుబాటులోకి వస్తుందని మైనింగ్ డీడీ రవిచంద్ బుధవారం తెలిపారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ రీచ్‌లో ఇసుకను వెలికి తీసి వినియోగదారులకు సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అవసరమైన వారు ఆన్‌లైన్ ఇసుక పోర్టల్ ద్వారా బుక్ చేసుకుని చలానా చూపితే ఇసుకను ట్రాక్టర్లలో లోడ్ చేస్తారని సూచించారు.
ఓపీలో మెరుగైన సేవలు అందించాలి
● వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు
కర్నూలు (హాస్పిటల్): బోధనాసుపత్రుల్లోని ఓపీల్లో రెండేసి యూనిట్ల వైద్యులు ఉండి రోగులకు సత్వర వైద్యసేవలు అందే విధంగా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. బుధవారం ఆయన అమరావతి నుంచి బోధనాసుపత్రి, మెడికల్ కళాశాల అధికారులతో జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్, బయోమెట్రిక్ ద్వారా హాజరు తప్పనిసరి చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు, సమస్యలు గురించి ఆరా తీశారు. ఆరోగ్య శాఖ మంత్రి సూచించిన 20 పాయింట్ల మూలంగా ఓపీలో ఏమైనా మెరుగుదల కనిపించిందా అని ప్రశ్నించారు. ఓపీలో రెండు యూనిట్ల వైద్యులు ఉంటే రద్దీగా ఉండే రోజుల్లో రోగులకు వైద్యపరీక్షలు త్వరగా చేసి సాయంత్రం లోగా సమగ్ర వైద్యం అందుకుని వారు ఇళ్లకు చేరే విధంగా చూడాలన్నారు. బయో మెడికల్ పరికరాలు ఎన్ని ఉన్నాయి, ఎలా పని చేస్తున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓల ఖాళీలను నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.
పాఠశాలల పనివేళలు
పెంచడం సరికాదు
కర్నూలు సిటీ: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్న పని వేళలను 5 గంటల వరకు పెంచుతూ పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని ప్రతి మండలంలో రెండు స్కూళ్లలో అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బుధవారం సలాంఖాన్ భవనంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 15 కి.మీ వరకు విద్యార్థులు ప్రయాణం చేయవలసి ఉంటుందన్నారు. అయితే, సమయానికి రవాణా సౌకర్యం లేక విద్యార్థులు ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు శేఖర్, దేవదాసు, గోవింద నాయక్, నారాయణ, హుస్సేన్ మియ్య, తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో నాణ్యత తప్పనిసరి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన సిబ్బందికి సున్నిపెంటలో నిర్మిస్తున్న వసతి గృహనిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పరిపాలనాంశాల్లో భాగంగా పలు ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు. ముందుగా సున్నిపెంటలో నిర్మిస్తున్న వసతి గృహాలను పరిశీలించారు. జంగిల్ క్లియరెన్స్, సంప్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పిల్లలు అడుకునేందుకు వీలుగా వసతిగృహాల వద్ద అటస్థలం కూడా ఉండాలన్నారు. హఠకేశ్వరం వద్ద భక్తులు సేదతీరేందుకు యాత్రిక షెడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనంతరం గణేశసదనంను పరిశీలించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఎం.నరసింహారెడ్డి, డీఈఈ చంద్రశేఖరశాస్త్రి, సుబ్బారెడ్డి, ఏఈలు పాల్గొన్నారు.
శ్రీశైలంలో 160 టీఎంసీలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయంలో బుధవారం సాయంత్రం సమయానికి 159.7646 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ సుంకేసుల నుంచి 4,032 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు జలాశయానికి ఎగువ నుంచి 1,984 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా దిగువ ప్రాజెక్ట్‌లకు 19,660 క్యూసెక్కుల నీరు విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment