ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలపై విచారణ
కొత్తపల్లి: ఉపాధి పనుల కల్పనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు హార్టికల్చర్ సబ్సిడీలు కల్పించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసలిమడుగు ఫీల్డ్ అసిస్టెంట్ దాసుపై శుక్రవారం ఆత్మకూరు క్లస్టర్ ఏపీడీ అన్వరాబేగం, ఏపీఓ హరికృష్ణ, సర్పంచు జమిలాబీతో కలిసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023–2024 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అనుబంధ శాఖల పనులపై గత జూలై 23వ తేదీన 17వ సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగింది. అందులో.. ముసలిమడుగు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ దాసు కొంతమందికి మాత్రమే ఉపాధి పని కల్పించడం, ఉద్యోగులకు హార్టికల్చర్ సబ్సిడీలు కల్పించడం వంటి విషయాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో పాటు 65 మంది రైతులు హార్టికల్చర్ సబ్సిడీలతో సాగుచేసిన మొక్కలు తగిన ఎత్తు లేకుండా చిన్నగా ఉన్నట్లు సామాజిక తనిఖీ సిబ్బంది తేల్చడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారన్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని, వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment