కంట్లో కారం చల్లి, కాళ్లు విరగ్గొట్టిన కుమారులు
అడ్డుకోని భార్య, కుమార్తె
గోనెగండ్ల: ‘మాకు పెళ్లి చేసుకునే వయసొచ్చింది.. ఎప్పుడు పెళ్లి చేస్తావు? ఆస్తులెప్పడు పంచుతావు?’ అంటూ కన్న తండ్రి అనే కనికరం లేకుండా కుమారులు పాశవికంగా దాడి చేశారు. వివరాలు.. గోనెగండ్లకు చెందిన మంత రాజుకు భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు నీలకంఠ, జగదీష్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
పెద్ద కూతురికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. కుమారులిద్దరూ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్ సమీపంలో కిరాణం షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెకు పెళ్లి కావాల్సి ఉంది. గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఉన్నాయి. ఈ స్థితిలో శుక్రవారం ఇద్దరు కుమారులు.. తమకు పెళ్లిళ్లు ఎప్పుడు చేస్తావని, ఆస్తి ఎప్పుడు పంచుతావని తండ్రితో గొడవపడ్డారు. తర్వాత ఇంటి తలుపులు మూసి తండ్రి కంట్లోకి కారం చల్లి కట్టెలతో చితకబాది కాళ్లు విరగ్గొట్టారు.
అడ్డుకోవాల్సిన భార్య, కూతురు కూడా వారికి వత్తాసు పలికారు. తీవ్రంగా గాయపడిన మంతరాజు కేకలు వేయడంతో స్థానికులు దాడిని అడ్డుకున్నారు. అనంతరం ఆటోలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు మంత రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ గంగాధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment