ఉపాధి నిధులతో పశుగ్రాసం సాగు
● 100 శాతం సబ్సిడీతో 10 – 50 సెంట్లలో సాగుకు అవకాశం ● జాబ్ కార్డు ఉండి ఐదెకరాల్లోపు పొలం కలిగిన ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు అర్హులు ● 1000 ఎకరాల్లో సాగు లక్ష్యం
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 100 శాతం సబ్సిడీతో బహువార్షిక పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. రైతులు 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు పశుగ్రాసం సాగు చేసుకోవచ్చు. పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం జాబ్ కార్డు కలిగి ఉండి ఐదెకరాల్లోపు పొలం కలిగిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతో పాటు సన్న, చిన్నకారు రైతులు బహువార్షిక పశుగ్రాసాల సాగుకు అర్హులు. జిల్లాలో 1000 ఎకరాల వరకు పశుగ్రాసాల సాగుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 10 సెంట్లలో పశుగ్రాసం సాగు చేసేందుకు మొత్తం ఖర్చు రూ.6,599 అవుతుంది. ఇందులో లేబర్ కాంపోనెంటు కింద రూ.3 వేలు, మెటీరియల్ కాంపోనెంటు (విత్తనం ధర, ఇతర ఖర్చులు) కింద రూ.3,599 చెల్లిస్తారు. 20 సెంట్లలో సాగు చేసుకుంటే లేబర్ ఖర్చు రూ.6 వేలు, మెటీరియల్ ఖర్చు రూ.7,197 (మొత్తం రూ.13,197), 30 సెంట్లలో సాగు చేసుకుంటే లేబర్ ఖర్చు రూ.9 వేలు, మెటీరియల్ ఖర్చు 10,795 (మొత్తం రూ.19,795), 40 సెంట్లలో సాగు చేసుకుంటే లేబర్ ఖర్చు రూ.12 వేలు, మెటీరియల్ ఖర్చు రూ.14,394 (మొత్తం రూ.26,394), 50 సెంట్లలో సాగు చేసుకుంటే లేబర్ ఖర్చు రూ.15 వేలు, మెటీరియల్ ఖర్చు రూ.17,992 (మొత్తం రూ.32,992) ఉపాధి నిధుల నుంచి చెల్లిస్తారు. దరఖాస్తుతో పాటు జాబ్‌కార్డు, భూమి 1బీ, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పాసు పుస్తకం, రేషన్‌కార్డు నకళ్లు సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత పశు వైద్యులను సంప్రదించాలని కోరారు.
సూపర్ నేపియర్ రకం సాగుకు అనుకూలం
బహువార్షిక పశుగ్రాసాల సాగుకు సూపర్ నేపియర్ రకం ఉమ్మడి కర్నూలు జిల్లాకు అనుకూలమని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. బహువార్షిక రకాల్లో ఇది ముఖ్యమైనది. ఈ పశుగ్రాసం అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. సారవంతమైన నేలలో అధిక దిగుబడి ఇస్తుంది. సూపర్ నేపియర్ రకాన్ని అన్ని కాలాల్లోను నాటుకోవచ్చు. 50 సెంట్ల భూమిలో ఏడాదికి 100 టన్నుల వరకు పశుగ్రాసం దిగుబడి వస్తుంది. సూపర్ నేపియర్ రకం సాగు జిల్లాకు అనుకూలమని పశుసంవర్ధక శాఖ అసిస్టెంటు డైరెక్టర్ డాక్టర్ నాగరాజు తెలిపారు. బహుళ వార్షిక పశుగ్రాసాలు ఒక్కసారి సాగు చేసుకుంటే కొన్నేళ్ల పాటు దిగుబడి వస్తుంది. అయితే నీటి సదుపాయం ఉండాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment