కిల్కారి మెసేజ్ విధానం ఎంతో ఉపయోగం
కర్నూలు(హాస్పిటల్): మాతాశిశువుల ఆరోగ్యానికి కిల్కారి మెసేజ్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.భాస్కర్ అన్నారు. మంగళవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో కిల్కారి మెసేజ్ విధానంపై ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆశా నోడల్ అధికారులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.భాస్కర్ మాట్లాడుతూ మాతాశిశు సేవలు బలోపేతం చేయడంలో భాగంగా కిల్కారి మెసేజ్ విధానం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విధానంలో గర్భిణిలకు 4వ మాసం నుంచి కాన్పు తర్వాత ఒక సంవత్సరం వరకు వారానికి ఒకసారి వాయిస్ మెసేజ్ 01244451660 నెంబర్ నుంచి వస్తుందన్నారు. ఏదేని కారణం వల్ల గర్భిణి/తల్లి ఆ వాయిస్ మెసేజ్ వినలేకపోయినచో తర్వాత 14423 నెంబర్‌కు కాల్ చేసి వాయిస్ మెసేజ్‌ను వినడానికి అవకాశం ఉందన్నారు. ఈ కాల్స్ పూర్తిగా ఉచితమని, ఎలాంటి కాల్ చార్జెస్ ఉండవని చెప్పారు. కిల్కారి ప్రోగ్రామ్ రీజనల్ కో ఆర్డినేటర్ కీర్తి మాట్లాడుతూ ఈ వాయిస్ మెసేజ్‌ల ద్వారా ముఖ్యంగా 4 అంశాల (మాతృ ఆరోగ్య సేవలు, శిశు ఆరోగ్యసేవలు, వ్యాధినిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ సేవలు) గురించి సలహాలు, సూచనలు ప్రీ రికార్డెడ్ వాయిస్ మెసేజ్ రూపంలో వస్తాయన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ నాగప్రసాద్‌బాబు, ఆర్‌బీఎస్‌కే పీవో డాక్టర్ హేమలత, డీపీహెచ్‌ఎన్‌వో అన్నపూర్ణ, డెమో శ్రీనివాసులు, ఎస్‌వో హేమసుందరం, డిస్ట్రిక్ట్ కమ్యూనిటి మొబిలైజర్ ప్రసాద్, డిప్యూటీ డెమో చంద్రశేఖర్‌రెడ్డి, హెచ్‌ఈ పద్మావతి, పీహెచ్‌ఎన్ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment