జైలు జీవితాన్ని గుణపాఠంగా తీసుకోవాలి
● ఎస్పీ బిందు మాధవ్
కర్నూలు: ఖైదీలు జైలు జీవితాన్ని గుణపాఠంలా తీసుకుని విడుదల అయిన తర్వాత మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఎస్పీ బిందు మాధవ్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సూచించారు. కర్నూలు మండలం పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా జైలును ఎస్పీ మంగళవారం సందర్శించారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సందర్భంగా అంతర్గత భద్రతపై జైలు అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులు, ఖైదీల కోసం వచ్చే సందర్శకులకు కేటాయించిన గది, ఖైదీలకు ఇచ్చే ఆహార పదార్థాల నాణ్యత తదితర వాటిని ఎస్పీ పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రత లోపాలు లేకుండా చూసుకోవాలని అంతర్గత భద్రతపై సెక్యూరిటీ కమిటీ సభ్యులకు సూచించారు. భద్రత పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఖైదీలలో పరివర్తన కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. అనంతరం జైలు పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసి జైలు విజిటింగ్ బుక్‌లో సంతకం చేశారు. జిల్లా జైలు పర్యవేక్షణ అధికారి చంద్రశేఖర్, జిల్లా సబ్ జైళ్ల అధికారి డి.నరసింహారెడ్డి, డిప్యుటీ జైలర్లు అనిల్ కుమార్‌రెడ్డి, నాగరాజు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్, డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment