నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేయండి
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడకు సంబంధించి ఇచ్చిన హామీలను ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పుచ్చకాయల మాడకు సీఎం ఇచ్చినహామీల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్‌కు సంబంధించి 16 అంతర్గత రోడ్లలో భాగంగా 11 సీసీ నిర్మాణాలను పూర్తి చేశారని, మిగిలిన 5 పనులను త్వరగా పూర్తి చేయాలని ఎస్‌ఈని ఆదేశించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, 22 మినీ గోకులాలు, 10 ఫారంపాండ్స్, 6 బౌండరీ ట్రెంచెస్, 6 ఫీడర్ చానళ్లను జనవరి 15లోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పుచ్చకాలయమాడకు హంద్రీనీవా నీటి సరఫరా, హిందూ శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణం, దర్గా కంపౌండ్ వాల్, బీటీ సర్పేస్ రోడ్డు నిర్మాణ పనుల మంజూరుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడుతానని కలెక్టర్ వివరించారు. కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు డీపీఆర్‌లను సిద్ధం చేయాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, పీఆర్ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నాగశివలీల, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment