చిప్పగిరి, మద్దికెరకు నీతి ఆయోగ్ అవార్డులు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో యాస్పిరేనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద చిప్పగిరి, మద్దికెర మండలాలు నీతి ఆయోగ్ అవార్డులకు ఎంపికై నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. దేశంలో ఎంపిక చేసిన 471 యాస్పిరేనల్ బ్లాకుల్లో నిర్దేశించిన సూచికల పురోగతిని పురిశీలించి నీతి ఆయోగ్ ర్యాంకులను ప్రకటించగా.. జూన్ త్రైమాసికానికి సంబంధించి చిప్పగిరికి 36, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి మద్దికెర 18వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. ఈక్రమంలో చిప్పగిరి మండలానికి రూ.1.50 కోట్లు, మద్దికెర మండలానికి రూ.కోటి నిధులను నీతి అయోగ్ ప్రకటించినట్లు కలెక్టర్ వివరించారు.
పరీక్ష పే చర్చాకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి
కర్నూలు సిటీ: విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే పరీక్ష పే చర్చా వచ్చే నెలలో జరగనుందని, ఇందులో పాల్గొనేందుకు అన్ని స్కూళ్లకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1వ తేది నాటికి 100 శాతం నమోదు పూర్తి అయ్యేలా చూడాలని డీఈఓ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
డీఎంహెచ్‌వో బాధ్యతల స్వీకరణ
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి(డీఎంహెచ్‌వో)గా డాక్టర్ పి. శాంతి కళ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఇన్‌చార్జ్‌గా వ్య వహరిస్తున్న డాక్టర్ ఎల్.భాస్కర్ బాధ్యతలు అప్పజెప్పారు. ఆమెను వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారులతో పాటు కార్యాలయ ఉద్యోగులు అభినందించారు. డాక్టర్ పి. శాంతికళ తిరుపతి స్వస్థలం. ఆమె పాఠశాల విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. అనంతరం ఎంబీబీఎస్ సైతం 1986 బ్యాచ్‌లో అక్కడే స్విమ్స్‌లో చదివారు. అనంతరం 1995 నుంచి 1997 వరకు కర్నూలు మెడికల్ కాలేజిలో డీజీవోగా పీజీ చేశారు. 1998లో అప్పటి కడప జిల్లా రైల్వేకోడూరు పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి పలు చోట్ల విధులు నిర్వర్తించారు. అనంతరం 2015 నుంచి 2018 వరకు సిద్దార్థ మెడికల్ కాలేజి(విజయవాడ)లో ఎస్‌పీఎం పీజీ చదివారు. ఆ తర్వాత జమ్మలమడుగు డిప్యూటీ డీఎంహెచ్‌వోగా 2018 నుంచి ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. పదోన్నతుల్లో భాగంగా సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది కర్నూలుకు బదిలీ అయ్యారు.
బుగ్గన్నపల్లి రైల్వే స్టేషన్ తనిఖీ
పాణ్యం/బేతంచెర్ల: మండల పరిధిలోని బుగ్గన్నపల్లి– సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్‌ను సికింద్రబాద్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్) కమిషనర్ మాధవి, సీఏఓ సత్య ప్రకాశ్, గుంతకల్ డీఆర్‌ఎం విజయకుమార్ తనిఖీ చేశారు. ఆధునీకరించిన బుగ్గనపల్లి స్టేషన్‌తో పాటు క్రిష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ మీదు గా పాణ్యం రైల్వే స్టేషన్ వరకు 19.035 కిలోమీటర్ల మేర పూర్తయిన కొత్త బ్రాడ్ గేజ్ విద్యుత్ డబుల్ లైన్‌ను పరిశీలించి రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత క్రిష్ణమ్మ కోన , పాణ్యం రైల్వే స్టేషన్లతో పాటు రిలే రూమ్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గుంతకల్ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment