ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపకపోతే చర్యలు
కర్నూలు(సెంట్రల్): ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను హెచ్చరించారు. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లకు సంబంధించి జనవరి 3వ తేదీన గృహ ప్రవేశాలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వివిధ అభివృద్ధి పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. మంత్రాలయం, పెద్దకడబూరు ఎంపీడీఓలు, మండలాల ప్రత్యేకాధికారులు హౌసింగ్‌కు సంబంధించి తగు ప్రణాళికలతో శనివారం కర్నూలు రావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వారంలో లే అవుట్‌లలో ఎలాంటి సమస్యలు లేకపోయినా పురోగతి లేకుండా చివరి స్థానంలో ఉన్న 10 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లను జిల్లా కేంద్రానికి పిలిపించాలని హౌసింగ్ పీడీ చిరంజీవిని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల్లో ఇప్పటి వరకు 513 పరిష్కారం అయ్యాయన్నారు. దేవనకొండ మండలంలో ఒక్క అర్జి కూడా పరిష్కారం కూడా కాకపోవడంపై కలెక్టర్ తహసీల్దార్‌పై ఆగ్రహం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని జేసీ నవ్యను ఆదేశించారు. గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను క్లీనింగ్, క్లోరినేషన్ చేయడంలో హొళగుంద, పెద్డకడబూరు మండలాలు వెనుకబడి ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న 10 చెత్త సంపద తయారీ కేంద్రాలను ఆపరేషన్‌లోకి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, పీఆర్ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ వెంకట రమణయ్య, డీపీఓ భాస్కర్ పాల్గొన్నారు.
కలెక్టర్ పి.రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment