కొనసాగుతున్న కానిస్టేబుళ్ల ఎంపిక
● తుది రాత పరీక్షకు 173 మంది మహిళా అభ్యర్థులు ఎంపిక
కర్నూలు: పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కర్నూలులో చురుగ్గా సాగుతోంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు స్థానిక ఏపీఎస్పీ రెండవ పటాలం పెరేడ్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. 5వ రోజు శనివారం 739 మందికి గాను 327 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. 1600 మీటర్లు, 100 మీటర్ల విభాగాల్లో పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహించారు. బయోమెట్రిక్‌కు హాజరైన మహిళా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 173 మంది అభ్యర్థులు ప్రతిభ కనపరచి తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఏవైనా సమస్యలు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు జనవరి 28వ తేదీన మరోసారి దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావచ్చని అధికారులు ప్రకటించారు.
7 నుంచి 15 వరకు సెలవులు...
పోలీసు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 6వ తేదీ మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారంతో పాటు ఈనెల 7 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఉన్నందున దేహదారుఢ్య పరీక్షలకు విరామం ప్రకటించారు. మంత్రి టీజీ భరత్ కూతురు వివాహ రిసెప్షన్ వేడుక ఈనెల 10వ తేదీన ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పోలీసు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్న గ్రౌండ్‌ను (మైదానం) కూడా వినియోగిస్తున్నారు. దీంతో పరుగుపందెం, లాంగ్‌జంప్ ట్రాక్‌లను మొత్తం చెరిపేస్తున్నారు. రిసెప్షన్ వేడుకకు భారీగా జనం తరలివస్తున్నందున మైదానాన్ని ఖాళీ చేయించి వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment