జెడ్పీలో 8 మందికి పరిపాలనాధికారులుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలోని మండల పరిషత్, పీఆర్‌ఐ, పీఐయూ ఇంజినీరింగ్ కార్యాలయాల్లో సీనియర్ సహాయకులుగా విధు లు నిర్వహిస్తున్న ఎనిమిది మందికి పరిపాలనాధికారులుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పదోన్నతి పొందిన వారికి సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించి వివిధ ప్రాంతాలకు పోస్టింగ్ ఉత్తర్వులు అందించారు. ఏఓలుగా వివిధ ప్రాంతాలకు నియమించిన వారిలో ఎన్ భాగ్యలక్ష్మిని ప్యాపిలి మండల పరిషత్‌కు, ఎం.నాగరాజస్వామిని పెద్దకడుబూ రు, బీఎల్ భరణీకుమారిని కోవెలకుంట్ల, ఎంజీ నాగేంద్రకుమార్‌ను పగిడ్యాల, శ్రీరాములును అవుకు, అబ్దుల్ అల్లం బాషా డోన్‌కు, రవీంద్రబాబును మండల పరిషత్ హాలహర్వికి, హేమలతను కర్నూలు డ్వామాకు పోస్టింగ్స్ ఇచ్చారు.
వైద్యసేవలు నిలుపుదల చేస్తూ నోటీసులు
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ఓపీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ఓపీ, ఐపీ సేవలు ఈ నెల 6వ తేదీ (సోమవారం) నుంచి నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ భాస్కరరెడ్డికి సోమవారం ఏపీ ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (అప్నా) నాయకులు నోటీసులు అందజేశారు. అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. నోటీసులు అందజేసిన వారిలో అప్నా కర్నూలు అధ్యక్షులు డాక్టర్ ఎన్.వేణుగోపాల్, ట్రెజరర్ డాక్టర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
పెరిగిన పత్తి ధర
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర పెరిగింది. సోమవారం 3,925 క్వింటాళ్లు పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.7,464, మధ్య ధర రూ.7,209, కనిష్ట ధర రూ.4,531గా నమోదయ్యింది. గత రెండు నెలలుగా రూ.7,200 ధర పలుకుతూ వచ్చింది. గత వారం నుంచి రూ.50 పెరుగుతూ సోమవారం రూ.7,464గా నమోదయ్యింది.
బంగారు పతకాలు ఇచ్చేందుకు దాతలకు ఆహ్వానం
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం సందర్భంగా యూజీ, పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న దాతలు ముందుకు రావాలని వర్సిటీ రిజిస్ట్రార్ డా.కె వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 8వ తేదీన మొదటి స్నాతకోత్సవంలో 866 మందికి డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నామన్నారు. వర్సిటీ కాలేజీల్లో చదివిన పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఆసక్తి ఉన్న వారు ఎవరైనా బంగారు పతకాలు ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. ముందుకు వచ్చే దాతలు 7013159019ను సంప్రదించాలన్నారు.
నేటి నుంచి విద్యుత్ చార్జీల పెంపుపై అభిప్రాయ సేకరణ
కర్నూలు న్యూసిటీ: విద్యుత్ చార్జీల పెంపుపై వినియోగదారుల అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ ఉమాపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్‌లు ప్రతిపాదించిన వార్షిక ఆదాయం, అవసరాలు, విద్యుత్ చార్జీలపై హైబ్రీడ్ విధానంలో అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. 7, 8 తేదీ ల్లో విజయవాడ ఎన్ కన్వెన్షన్‌లో, 10 వ తేదీన కర్నూలు నగరంలోని ఏపీఈఆర్‌సీ భవనం, ఎమ్మిగనూరు, ఆదోని డివిజన్లలో ఇంజినీరింగ్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు బహిరంగ విచారణ, మధ్యాహ్నం 2 నుంచి 4.30గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment