అంకితభావంతో అభివృద్ధికి కృషి
● వనరుల సద్వినియోగంతో రూ.12 కోట్లకు చేరిన జెడ్పీ ఆదాయం ● వ్యవసాయం, తాగునీరు, గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ● మూడేళ్ల పాలనపై జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఈ నెల 4వ తేదీకి జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఆయన జెడ్పీలోని తన చాంబర్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దగా ఆదాయ వనరులు లేని జిల్లా పరిషత్‌కు ఆర్థిక జవసత్వాలు తీసుకువచ్చేందుకు అందరి సహకారంతో పనిచేస్తున్నామన్నారు. 2014– 15 నుంచి 2020–21 వరకు రూ.6 కోట్లకు మించని జిల్లా పరిషత్ ఆదాయాన్ని రూ.12 కోట్లకు తీసుకువచ్చామన్నారు. ముఖ్యంగా జెడ్పీ స్థిరాస్థులకు సంబంధించిన, స్టాంప్ డ్యూటీ, సీనరేజి గ్రాంట్, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతరత్రా వనరులతో జెడ్పీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాల్లో ప్రజా అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్త్తూ సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు నిర్వహించిన 10 సర్వసభ్య సమావేశాల్లో ఏడు పర్యాయాలు తాగునీరు, వ్యవసాయం, హౌసింగ్‌పై సమీక్షలు నిర్వహించామన్నారు. ప్రతి సమావేశంలోనూ అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయన్నారు.
తాగునీటి పథకాల నిర్వహణకు రూ.211.44 కోట్లు ...
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 60 సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా 663 ఊర్లకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని జెడ్పీ చైర్మన్ అన్నారు. ఈ పథకాల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2021–22 నుంచి 2023–24 వరకు రూ.211.44 కోట్లు వెచ్చించామని, 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.85.71 కోట్లు వెచ్చించేందుకు పరిపాలనా ఆమోదం జారీ చేశామన్నారు. అలాగే గడిచిన మూడేళ్లలో 99 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.4,11,46,528 ఖర్చు చేసి 72 పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. జెడ్పీ ఆదాయాన్ని పెంచేందుకు జిల్లా పరిషత్ పాత భవనాన్ని ఏపీ టూరిజం కార్పొరేషన్‌కు అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ భవనంలో కన్‌స్ట్రక్షన్ ఒక ఎస్‌ఎఫ్‌టీ రూ.15, ఖాళీ స్థలం రూ.7.50 కు ఇచ్చేందుకు పాలక వర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలిని కలిసి విన్నవించామన్నారు. అలాగే జిల్లా పరిషత్ ముందు భాగంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ఆలోచిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment