ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 45 లక్షలు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ హండీలలో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, హుండీ పర్యవేక్షణ అధికారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాలక్షేపపు మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 34 రోజులకు సంబంధించి ఓ హుండీ ద్వారా రూ.41,26,644, అన్నదానానికి సంబంధించిన మరో హుండీ ద్వారా రూ. 4,24,846 ఆదాయం వచ్చింది. వెండి 6.200 కేజీలు, బంగారం 19 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో దేవాలయ సిబ్బందితో పాటు ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు ఈరప్పస్వామి, మహదేవస్వామి, యూనియన్ బ్యాంకు సిబ్బంది, ఆదోని భ్రమరాంబా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఆదోని సబ్ రిజిస్ట్రార్‌గా అరుణ్‌కుమార్
ఆదోని అర్బన్: ఆదోని సబ్ రిజిస్ట్రార్‌గా మంగళవారం అరుణ్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడున్న సబ్ రిజిస్ట్రార్ హజీమియాను అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అధికారులు సస్పెండ్ చేశారు. ఆస్పరి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు ఆదోనికి బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన అనతరం అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. పక్కా పత్రాలు, ఆధార్‌కార్డు, వేలిముద్రలు ఉంటేనే కార్యాలయానికి రావాలన్నారు. ఎవరైనా నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంగన్‌వాడీ కొలువుల నోటిఫికేషన్ రద్దు
కర్నూల(సెంట్రల్):జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు,ఆయాల నియామకం కో సం 2024 ఫిబ్రవరిలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను పరిపాలన కారణాల రీత్యా రద్దు చేసినట్లు కలెక్టర్ పి.రంజితబాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని అభ్యర్థులను కోరారు.
ఎన్నాకెన్నాళ్లకు!
● మార్కెట్‌లో పత్తికి గిట్టుబాటు ధర
ఆదోని అర్బన్: పత్తి కోతలు ప్రారంభమైనప్ప టి నుంచి మార్కెట్‌లో గిట్టుబాటు ధర రైతులు పొందలేదు. కేవలం సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే అరకొరగా లభించింది. మార్కెట్‌లో పత్తి ధర క్వింటం రూ. 7,200కు మించలేదు. కాగా మంగళవారం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.7,500 పత్తి ధర పలికింది. ఈ మేరకు 3,131 క్వింటాళ్లు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.7,509, మధ్య ధర రూ.7,209, కనిష్ట ధర రూ.5,080గా నమోదయ్యింది. పత్తి గింజలకు డిమాండ్ పెరగడంతో ఈ ధర పలికిందని వ్యాపారవర్గాలు తెలిపాయి. అదేవిధంగా కందుల దిగుబడులు గత వారంలో రూ.7 వేలు ధర పలికింది. మంగళవారం కందులు 96 సంచులు (48 క్వింటాళ్లు) రాగా గరిష్ట ధర రూ.7,410, మధ్య ధర రూ.6,679, కనిష్ట ధర రూ.3,010గా పలికింది.
ట్రిపుల్ ఐటీడీఎంనుసందర్శించిన విదేశీ ప్రొఫెసర్లు
కర్నూలు సిటీ: సాంకేతికతో కూడిన విద్య, పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిపుల్ ఐటీ డీఎం)ను విదేశీ వర్సిటీల ప్రొఫెసర్లు మంగళవారం సందర్శించారు. ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్న పీజీ ప్రోగ్రాంలను, షార్ట్‌టర్మ్ కోర్సులను పరిశీలించారు. తర్వాత ట్రిపుల్‌ఐటీ డీఎం డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఐటీడీఎంను సందర్శించిన వారిలో కొరియా దేశానికి చెందిన జియోంగ్‌సాంగ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఆచార్యులు ఎన్.సుబ్బారెడ్డి, మలేషియాకు చెందిన కర్టిన్ యూనివర్సిటీ ఆచార్యులు మోహన్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment