ఏపీ గురుకులలో లైంగిక వేధింపులపై విచారణ
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో విద్యార్థినులపై జరిగిన లైంగింక వేధింపుల ఘటనపై మంగళవారం ట్రైనీ కలెక్టర్ కళ్యాణి విచారణ చేపట్టారు. ముందుగా ఆమె కాలేజీలోని తరగతి గదులు, ల్యాబ్, లైబ్రేరి, వంట గదులు, డార్మెటరీ, వాష్ రూమ్‌లను కలియ తిరిగి పరిశీలించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అక్కడ పనిచేసే సిబ్బందిని విచారించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. సమస్యలు, లైంగిక వేధింపులపై నిజాలే చెప్పాలని కోరగా వారు కాలేజీలో జరిగిన విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు వచ్చినట్లు చెప్పారు. ఇక్కడ విద్యార్థినులు చాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందులో మౌలిక సదుపాయాల లేమి కూడా ఒకటని అన్నారు. లైంగిక వేధింపులపై జరిపిన విచారణ నివేదికలు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషాకు అందజేస్తానని చెప్పారు. అనంతరం ఐసీడీఎస్ వారు తెచ్చిన హెల్ప్‌లైన్ ఫోన్ నెంబర్ల పోస్టర్‌ను కాలేజీలో అతికించారు. ఏమైనా సమస్య ఉంటే అందులోని నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారని విద్యార్థినులకు భరోసా ఇచ్చారు. ట్రైనీ కలెక్టర్ వెంట డీసీపీవో శారద, డిప్యూటీ తహసీల్దార్ వీరభద్రగౌడ్, వీఆర్వో మోహన్, ఐసీడీఎస్ సీడీపీఓ సఫర్నీసాబేగం, సూపర్ వైజర్ ప్రీతి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment