స్టాఫ్ అసిస్టెంటు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ఖాళీగా ఉన్న 50 స్టాప్ అసిస్టెంటు పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 13 పోస్టులు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పని చేసే సిబ్బందికి కేటాయించారు. మొత్తం పోస్టుల్లో 29 పోస్టులు జనరల్, 21 పోస్టులు మహిళలకు కేటాయించారు. రోస్టర్ ప్రకారం భర్తీ చేస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ నెల 8 నుంచి అప్‌లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుల అప్‌లోడ్‌కు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం www.kurnooldccb.com వెబ్‌సైట్ ను సందర్శించవచ్చని డీసీసీబీ అధికార వర్గాలు తెలిపాయి.
కొనసాగుతున్న ఆరోగ్య పింఛన్ల తనిఖీ
సి.బెళగల్: ఆరోగ్య సంబంధ సమస్యల పింఛన్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. మండలంలోని 11 గ్రామ సచివాలయాల పరిధిలో డయాలసిస్, తలసేమియా వ్యాధిగ్రస్తులుగా రూ.10 వేలు, రూ.15 వేల పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు 27 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన వైద్యులు కిరణ్‌కుమార్, పద్మ తదితరులు బుధవారం గ్రామాల్లో పర్యటించి పింఛన్ లబ్ధిదారుల వివరాలు ఆరా తీశారు. వైద్యుల వెంట ఎంపీడీఓ రాణెమ్మ, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సి.బెళగల్ పీహెచ్‌సీ డాక్టర్ మిథున్‌కుమార్‌రెడ్డి, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సచివాలయాల ఉద్యోగు లు ఉన్నారు.
ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షల్లో 90 శాతం మంది హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరిగిన ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షల్లో 90 శాతం హాజరు నమోదైందని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 2,4,6,8,10 సెమిస్టర్ పరీక్షలకు 553 మందికి 496 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. కర్నూలు ఉస్మానియా కళాశాల పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ సందర్శించి పరిశీలించారు. పరీక్షలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
శ్రీశైలంలో రేపు ముక్కోటి ఏకాదశి ఉత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజామున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తరద్వార దర్శనం, రావణవాహనసేవ నిర్వహిస్తా మని అన్నారు. ఉదయం 3గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి మంగళవాయిద్యాల అనంతరం 3.30 గంటలకు స్వామివారికి సుప్రభాతసేవ, 4.30 గంటలకు స్వామివారికి, అమ్మవారికి మహామంగళహారతులు జరిపిస్తారన్నారు. అనంతరం 5.30 గంటలకు రావణవాహనసేవ,స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం, అనంతరం 6గంటలకు సర్వదర్శనం, అర్జితసేవలు ప్రాంభమవుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment