పెద్దాసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు
హెచ్‌ఎంపీ వైరస్ ప్రాణాంతకం కాదు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలోని ఓల్డ్ గైనిక్ విభాగంలో 20 పడకలతో అన్ని సదుపాయాలతో ఏర్పాట్లు చేశాము. దాంతో పాటు పాత ఐడీ విభాగంలో మరికొన్ని పడకలు ఏర్పాటు చేస్తాము. ఆరుగురు వైద్యులతో కూడిన ఎక్స్‌పర్ట్ కమిటీ ఏర్పాటు చేశాము. అవసరమైన మందులు, వైద్యపరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాము. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క హెచ్‌ఎంపీవీ కేసు కూడా నమోదు కాలేదు.
–డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు
ఇది పాత వైరస్సే
హ్యూమన్ మెటా న్యూమో వైరస్(హెచ్‌ఎంపీవీ) పాతదే. దీనిని 2001లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇతర శ్వాస కోశ వైరస్‌లాగే సాధారణ జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు ఇది కలిగిస్తుంది. ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి సాధారణ లక్షణాలు. కొంత మందిలో బ్రాంకై టిస్, న్యూమోనియా కూడా రావచ్చు. అయినా, భయపడాల్సిన అవసరం లేదు.
–డాక్టర్ సువర్ణ లక్ష్మి కల్లి, పల్మనాలజిస్టు, కర్నూలు
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో ఎక్కడా హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కాలేదు. అయినా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. జనసమూహాలకు వెళ్లినప్పుడు దూరం పాటించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి, ముక్కుకు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరం లేదా తుమ్ములు ఉంటే జన సమూహాలకు వెళ్లకూడదు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
– డాక్టర్ పి. శాంతికళ, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment