పేదల ఆరోగ్యంతో చెలగాటమా!
● 8 నెలల కూటమి పాలనలో
ప్రజలకు ఒరిగిందేమి లేదు
● సూపర్ సిక్స్ హామీల అమలులో
సీఎం చంద్రబాబు వైఫల్యం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి
పత్తికొండ(తుగ్గలి): ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నీరుగార్చి పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పత్తికొండలో కేడీసీసీ మాజీ వైస్ చైర్మన్ ఎస్. రామచంద్రారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అనేక రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడమే కాకుండా పరిమితిని రూ.25 లక్షలకు పెంచి పట్టిష్టం చేశారన్నారు. ఐదేళ్లలో ఈ పథకానికి రూ.30వేల కోట్లు వెచ్చించారన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 50 వేల ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. నెలనెలా క్యాలెండర్ కచ్చితంగా అమలు చేసి హామీలన్నీ నెరవేర్చిన ఘన త వైఎస్ జగన్‌దేనన్నారు. పేదలకు ఎంతో ఆసరాగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు గారుస్తున్నారని ఆరోపించారు. ప్రయివేటు బీమా కంపెనీకి ఆరోగ్యశ్రీ పథకాన్ని కట్టుబెడితే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఈ పథకాన్ని నిర్వీ ర్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ సేవలందక పేదల ప్రాణాలు పోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రూ.3వేల కోట్ల బకాయిలకు గాను రూ.500 కోట్లు చెల్లిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఒక్క నర్సు ఉద్యోమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. 8 నెలల కూటమి పాలనలో రూ.75 వేల కోట్లు అప్పు చేసిందే తప్పా ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. పింఛన్ వెయ్యి రూపాయలు పెంచి గొప్పలు చెప్పుకున్న నేతలు ఇప్పుడు కోతలు పెట్టేందుకు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారనానరు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలు తరి మికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీరంగడు, నాగభూషణరెడ్డి, గోపాల్‌రెడ్డి, సుధాకరరెడ్డి, జయచంద్రారెడ్డి, భరత్‌రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment