జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రన్నరప్‌గా ఏపీ
డోన్: కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఈనెల 6 నుంచి నిర్వహిస్తున్న 70వ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఏపీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో ఇండియన్ రైల్వేస్ జట్టు చేతిలో ఓటమి పాలుకావడంతో ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. కాగా ఏపీ జట్టు సభ్యులను ఆదివారం బాల్ బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, కోచ్ కేఈ మౌలా, జాతీయ క్రీడాకారులు రషీద్, ఆనంద్, రిజ్వాన్, ఇబ్రహీం, ఇంథియాజ్, గంగన్న, అనార్, రైల్వే నాగేంద్ర, రాజు, జట్టు మేనేజర్ రైల్వే ప్రకాష్ అభినందించారు.
ఆలయ హుండీలో చోరీ
కోసిగి: దొడ్డి గ్రామం నుంచి చిన్న భూంపల్లి గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం హుండీలో శనివారం రాత్రి గుర్తు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన పలువురు భక్తులు వెళ్లి చూస్తే హుండీని పగులకొట్టినట్లు కనిపించింది. అందులో ఉన్న నగదును దోచుకెళ్లినట్లు గుర్తించారు. ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజు నుంచి మరలా శ్రీరామ నవమి వరకు హుండీ లెక్కిస్తున్నారు. హుండీలో దాదాపు రూ. 20వేల వనకు నగదు ఉంటుందని భక్తులు చెప్పారు. గ్రామ శివారులో ఉండడంతో మూడో సారి దొంగతనం జరిగిందని తెలిపారు.
కృష్ణ జింక మృతి
మిడుతూరు: మండల పరిధిలోని నాగలూటి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కృష్ణజింక ఆదివారం రాత్రి సమయంలో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామ శివారు ప్రాంతం నుంచి ఓ కృష్ణజింక పరుగెత్తుకొని వచ్చింది. జనావాసాలను చూసి బెదిరి ఊర్లోకి పరుగెత్తుకుంటూ వెళ్తున్న సమయంలో అదుపుతప్పి ఇంటి గోడలను తగిలి కిందపడింది. తిరిగి లేచి మళ్లీ పరుగెత్తే సమయంలో నిర్మాణంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడలకు తగలడంతో అక్కడికక్కడే మృత్యువాతపడినట్లు గ్రామస్తులు తెలిపారు. రోళ్లపాడు అటవీ సిబ్బందికి సమాచారం చేరవేశామన్నారు.
ఆర్‌ఎఫ్‌పీ టెండర్లతో
తీవ్ర అన్యాయం
కర్నూలు(సెంట్రల్): రిక్వెస్టు ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) కొత్త టెండర్లతో 104 ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, పెద్దయ్య పేర్కొన్నారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న విధానం ఉద్యోగులకు ఎంతో బాగుందని, అయితే కొత్తగా రూపొందించిన ఆర్‌ఎఫ్‌పీలో డీఈఓలకు జీతభత్యాల విషయంలో ఎలాంటి మార్పు జరుగలేదన్నారు. అలాగే పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాల విషయంలో స్పష్టత లేదన్నారు. అంతిమంగా సీటీసీ పదాన్ని చేర్చడంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో కె.వెంకటేష్, కల్యాణి, చంద్రహాస్ పాల్గన్నారు.
Comments
Please login to add a commentAdd a comment