హోరాహోరీగా బండలాగుడు పోటీలు
వెల్దుర్తి: గుంటుపల్లె గ్రామంలో రాష్ట్రస్థాయిలో న్యూ కేటగిరీ వృషభాల బండలాగుడు పోటీలు హోరాహోరీగా జరిగాయి. గుంటి రంగాస్వామి తిరుణాలను పురస్కరించుకొని నిర్వహించిన ఈపోటీల్లో అనంతపురం జిల్లా అక్కంపల్లె ఇంద్రరెడ్డి వృషభాలు 2,550 అడుగుల దూరం బండలాగి విజేతగా నిలిచి రూ.40 వేలు గెలుచుకున్నాయి. తర్వాతి నాలుగు స్థానాల్లో వరుసగా నంద్యాల కొత్తకోట కంభయ్య వృషభాలు, మల్లేల ఎస్‌ఎస్‌వీ ట్రేడర్స్ ఎడ్లు, డి రంగాపురం రామకృష్ణారెడ్డి ఎడ్లు, అనంతపురం సింగనగుంటపల్లె మోహన్‌కృష్ణ, రుద్రవరం ఎల్లగౌడ్ ఎడ్లు సంయుక్తంగా నిలిచి రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు నగదు బహుమతులు గెలుచుకున్నాయి. అలాగే పరుగు పందెంలో ప్రథమ స్థానంలో సిద్ధినగట్టు నవీన్, రెండో స్థానంలో రామకృష్ణాపురం వినోద్ నిలిచి వరుసగా రూ.2,016, రూ.1,016 నగదు బహుమతి గెలుచుకున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
అనంతపురం: నగరంలోని బుడ్డప్పనగర్‌లో ఓ వివాహిత మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. వన్‌టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం ఎన్. కొట్టాలపల్లికి చెందిన శ్యామల (28)కు అనంతపురం నగరానికి చెందిన భాస్కర్‌తో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భాస్కర్... పత్తికొండలోనే ఉంటూ శని, ఆదివారాల్లో అనంతపురానికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుడ్డప్ప నగర్‌లోని తన ఇంటిపై భాగాన ఉన్న రేకుల షెడ్డులో ఆదివారం శ్యామల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని గుర్తించిన భాస్కర్ వెంటనే శ్యామల కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆమె ఆత్మహత్యకు మీరే కారణమంటూ ఫోన్‌లో పేర్కొన్నాడు. దీంతో కుటుంబసభ్యులు అనంతపురానికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని పరిశీలించి, బోరున విలపించారు. కొన్నేళ్లుగా తమ కుమార్తెను అల్లుడు పుట్టింటికి పంపడం లేదని, దీంతో తరచూ తమకు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేదని తెలిపారు. శ్యామల మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ మృతురాలి తల్లి రామలక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment