![‘విరస](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09knl255-600517_mr-1739131252-0.jpg.webp?itok=SRUw1IZ5)
‘విరసం’ రచనలతో సమాజ చైతన్యం
కర్నూలు కల్చరల్: విప్లవ రచయితల సంఘం (విరసం) రచనలు సమాజ చైతన్యానికి తోడ్పడుతున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కర్నూలు నగరంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న విరసం 24వ సాహిత్య పాఠశాల కార్యక్రమం ఆదివారం ముగిసింది. ముఖ్య వక్తగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఫాసిజం దేశంలో నలుమూలల విస్తరించిందని, రాజ్య హింస అవధులు దాటుతోందన్నారు. భారతీయ సమాజంలో అంబేడ్కర్ తరువాత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తిగా వరవరరావు కనబడతాడన్నారు. సాహిత్యంలో ప్రధాన భూమిక పోషించి ఉంటే ఆయనకు జ్ఞాన పీఠ పురస్కారం వచ్చేదన్నారు. గ్రాంసీ తరువాత అంత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తి సాయిబాబా మాత్రమే అన్నారు. ఒక అమానవీయ భావజాలం ఏర్పడిందని, గొప్ప వ్యవస్థను నిర్మించలేక పోతున్నామన్నారు. కుంభమేళాలలో వేల మంది చనిపోతే దేనికి నిదర్శనమన్నారు. మేధావులు జ్ఞానాన్ని భాషగా మార్చాలన్నారు. ఇటీవల కాలంలో రచయితలు ప్రజలకు దగ్గరయ్యే సాహిత్యం సృష్టించడం ఆశాజనకంగా భావిస్తున్నామన్నారు. బహిరంగ సభకు నాగేశ్వరాచారి అధ్యక్షత వహించారు. ఈ సభల్లో దాదాపు 27 పుస్తకాలు ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యంలో వెలుగు నీడలు అన్న అంశంపై వరలక్ష్మి అధ్యక్షత వహించగా విప్లవ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడారు. విప్లవోద్యమంపై ఫాసిస్ట్ యుద్ధం బుద్ధి జీవుల పాత్ర అనే అంశంపై సాగర్ అధ్యక్షత వహించగా పాణి మాట్లాడారు. విరసం నాయకులు రివేరా, శశికళ, అరుణ్, రత్నం ఏసేపు, కవులు రచయితలు మారుతి, ఎస్‌డీవీ అజీజ్, వెంకటేష్, ఏవీ రెడ్డి పాల్గొన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్
![‘విరసం’ రచనలతో సమాజ చైతన్యం1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09knl250-600517_mr-1739131252-1.jpg)
‘విరసం’ రచనలతో సమాజ చైతన్యం
Comments
Please login to add a commentAdd a comment