నులిపురుగులను నిర్మూలిద్దాం
కర్నూలు(హాస్పిటల్):చిన్నారుల్లో ఏర్పడే నులిపురుగులను ఆల్బెండజోల్ మాత్రలు మింగించి నిర్మూలిద్దామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్‌బాషా అన్నారు. సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్మారక నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకర భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. చిన్నపిల్లల్లో, బాలబాలికల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతకు కారణమయ్యే నులి పురుగులను నివారించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తోందన్నారు. నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకుని ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. ఏదైనా కారణం చేత 10వ తేదీన మాత్రలు అందని పిల్లలకు 17వ తేదీన అందజేస్తారని తెలిపారు. నులిపురుగులు శరీరంలో ఉంటే రక్తహీనతకు గురికావాల్సి వస్తుందని, అందువల్ల విద్యార్థులందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. భోజనం తినకముందు, తిన్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే గోళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పండ్లను, శుభ్రమైన నీటితో కడిగి తినాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. శాంతికళ, జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్, ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్ డాక్టర్ శైలేష్‌కుమార్, వైద్యాధికారి డాక్టర్ మాధవి, హెడ్‌మాస్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీలో
జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment