![ధీమా కరువై!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/09knl13c-200005_mr-1739215832-0.jpg.webp?itok=pbtif2Ep)
ధీమా కరువై!
ఈ చిత్రంలో భార్యా పిల్లలతో కనిపించే వ్యక్తిపేరు ఎల్లక్రిష్ణ (ఏసు). మండల కేంద్రమైన వెల్దుర్తి గ్రామానికి చెందిన ఈయన 2024న మే నెలలో అనారోగ్య కారణాలతో మరణించారు. ఇతని భార్య సుజాత, నలుగురు పిల్లలను ప్రభుత్వం ఆదుకోలేదు. చంద్రన్న బీమా సాయం ఊసే లేకుండా పోయింది. కనీసం రిజిష్ట్రేషన్ చేయించడానికి ప్రయత్నిస్తే సైట్ క్లోజ్ అయిందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నిరుపేద కుటుంబానికి ఎలాంటి భూమి లేదు. ఎనిమిది నెలలు గడిచినా బీమా ఊసే లేకపోవడంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది.
కర్నూలు(అగ్రికల్చర్): చంద్రన్న బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాకపోయినా పట్టించుకోవడం లేదు. ఇంటి పెద్దను కోల్పోయి వేలాది సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు. కనీసం పరిహారం అందించి దయ, సానుభూతి కూడా చూపడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పాలకులు పూర్తిగా పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంటికి ఆధారమైన వ్యక్తి మృతి చెందినప్పుడు ఆ కుటుంబం వీధిన పడరాదనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్ బీమా అమలు చేసింది. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూపాయి ఖర్చు లేకుండా బీమా కల్పించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే వైఎస్‌ఆర్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా మార్చింది. అయితే కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందితే పరిహారం ఇవ్వడాన్ని మరచింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది మంది మృతి చెందినా ఒక్క కుటుంబానికి కూడా ధీమా లభించలేదు.
ఇదీ దుస్థితి..
ప్రమాదవశాత్తు ఇంటి పెద్ద మృతిచెందితే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు, సహజంగా మృతి చెందితే రూ.5 లక్షలకు బీమా సదుపాయం కల్పిస్తామని 2024 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8వ నెల నడుస్తున్నా హామీ అమలుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. చంద్రన్న బీమా సైట్ ఓపెన్ కాకపోవడంతో మరణించిన వారు.. వారి వారసుల వివరాలను నమోదు చేసే అవకాశమే లేకుండా పోయింది. ఇచ్చిన హామీ ప్రకారం కుటుంబానికి ఆధారమైన 18–50 ఏళ్లలోపు పాలసీదారులు సాధారణంగా మరణిస్తే చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు, 18–70 ఏళ్ల లోపు పాలసీదారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు పరిహారం లభిస్తుంది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 18 నుంచి 50 ఏళ్లలోపు వారు 10 వేల మందికిపైగా మృతిచెందారు. ప్రమాదవశాత్తు 1,500కిపైగా మృతిచెందారు. 80 శాతం మృతుల కుటుంబాలకు బీమా అర్హత ఉన్నా పరిహారం అందలేదు. నిబంధనల ప్రకారం బీమా ఉన్న వ్యక్తి మృతి చెందితే 24 గంటల్లో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రన్న బీమా సైట్ క్లోజ్ కావడంతో మృతిచెందిన వారి కుటుంబాలకు ఊరట దక్కడం లేదు.
టీడీపీ కార్యకర్తలకు పెద్దపీట
సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే మృతులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పెద్దపీట వేస్తోంది. కోటి మందికిపైగా టీడీపీ సభ్యత్వం కల్పించడంతో పాటు రూ.5 లక్షలకు ప్రమాద బీమా కూడా కల్పించింది. టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన విలువ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఇవ్వకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తమకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కాదని టీడీపీ నిరూపించుకున్నట్లు అయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు
అవుతున్నా అమలు శూన్యం
ఆన్‌లైన్‌లో క్లోజ్ అయిన
చంద్రన్నబీమా సైట్
వేల కుటుంబాలకు అందని పరిహారం
హామీ అమలులో దారుణ విఫలం
కష్టాల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment