![సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10sri02a-200080_mr-1739215834-0.jpg.webp?itok=aQ5dpuR_)
సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యం
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 19 నుంచి 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దేవస్థాన కమాండ్ కంట్రోల్ రూంలో హోంశాఖ మంత్రి వి.అనిత, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారి , జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్టు చరణ్, దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్, దేవదాయ సీఎఫ్‌ఓ. ఎస్.చంద్రశేఖర్ ఆజాద్, ఈ.ఓ. శ్రీనివాసరావు, ఫారెస్ట్ డీఎఫ్‌ఓ తదితరులు జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. లక్షల సంఖ్యలో శివస్వాములు, భక్తులు కాలినడకన నల్లమల అటవీమార్గాన శ్రీశైలం చేరుకుంటారని వారికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా పటిష్ట ప్రణాళికను రూపొందించి అమలు చేయాలన్నారు. ఆలయ సమీప ప్రాంత రోడ్ల వద్దకు, సత్రాల వద్దకు చేరుకొనేలా ఉచితంగా మినీ వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. మహాశివరాత్రిలో ముఖ్య పర్వదినాలైన 24, 25, 26, 27 తేదీల్లో క్యూల్లో ఉన్న భక్తులకు చిన్న ఉచిత లడ్డూను ప్రసాదంగా అందజేయాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆరు డ్రోన్ కెమెరాలను దేవదాయశాఖ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. పాదయాత్రన వచ్చే భక్తులకు చెంచుగూడేల్లో మంచినీరు, బిస్కెట్లు అందించాలని, ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఫారెస్టు అధికారులకు సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న దర్శనానికి వచ్చే వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకంగా రెండు స్లాట్లను ఏర్పాటు చేయాల్సిందిగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన సూచన ఆహ్వానించదగ్గదేనని మంత్రులు అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులకు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు వివరించారు.
శ్రీశైలంలో ప్రతిష్టాత్మకంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment