2,82,000 క్వింటాళ్ల పత్తి విక్రయం
వరంగల్: ప్రస్తుత పత్తి సీజన్‌లో వరంగల్ జిల్లా పరిధిలోని మార్కెట్లు, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఈ నెల 16 వరకు 2,82,000 క్వింటాళ్ల పత్తిని రైతులు విక్రయించారు. జిల్లా వ్యాప్తంగా 28 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 26 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి ప్రారంభించగా ఆ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి పత్తిని కొనుగోళ్లు చేశారు. సీసీఐ కేంద్రాల్లో 4618 మంది రైతుల నుంచి రూ.88.47కోట్ల విలువైన 1,20,659 క్వింటాళ్లు పత్తిని కొనుగోలు చేశారు. అందులో 4610 మంది రైతులకు కనీస మద్దతు ధరలు లభించాయి. సీసీఐకి విక్రయించిన 4618 మంది రైతులకు గాను 2653 మందికి రూ.45.59కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారి ఖాతాల్లో డబ్బులు మూడు పనిదినాల్లో జమ చేస్తుందని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. అలాగే, జిల్లాలోని మార్కెట్లలో ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుంచి 1.61,341 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులకు వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారని అడ్తివ్యాపారులు తెలిపారు.
దిగుబడి తగ్గే అవకాశాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గతేడాది సాగు చేసిన పత్తి 36,50,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి అయింది. ఈ ఏడాది సుమారు 5–10 శాతం విస్తీర్ణం తగ్గినప్పటికీ దిగుబడి గతేడాది కంటే పెరుగుతుందని వ్యాపారులు అంచనాలు వేశారు. కానీ అకాల వర్షాలతో పత్తి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు వస్తుందని రైతుల భావించగా ప్రస్తుతం 4–7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. దీంతో రైతులు మొదటి కోతతో మొత్తం పత్తిని సేకరించి దాని స్థానంలో మొక్కజొన్న వేస్తున్నట్లు అధికారులు, వ్యాపారులు తెలిపారు.
తగ్గిన తేమతో గరిష్ట ధరలు..
ప్రస్తుతం విక్రయానికి వస్తున్న పత్తిలో తేమ శాతం తక్కువ నమోదు అవుతుండడంతో సీసీఐ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తోంది. మార్కెట్‌కు బస్తాల్లో తెస్తున్న పత్తిలో తేమ నిర్దేశించిన మేరకు ఉంటే ప్రైవేట్ వ్యాపారులు సైతం సీసీఐ ధరలకు అటు ఇటుగా చెల్లింపులు చేస్తున్నారు. దిగుబడి తగ్గుతున్నందున ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
సీసీఐ కొనుగోళ్లు 1,20,659 క్వింటాళ్లు
ప్రైవేట్ 1,61,341 క్వింటాళ్లు..
Comments
Please login to add a commentAdd a comment