విద్యుదాఘాతంతో రైతు మృతి
● అధికారుల నిర్లక్ష్యమే కారణమని గిరిజనుల ఆరోపణ
కొడకండ్ల : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని హక్యాతండా జీపీ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం .. హక్యాతండా పంచాయతీ పరిధిలోని మంగ్యా తండాకు చెందిన గుగులోత్ శ్రీను (35) వ్యవసాయంతో పాటు ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం మండలకేంద్రం శివారులో పొలం దున్ని నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ రైతు పామాయిల్ తోటకు అమర్చిన ఫెన్సింగ్ పై 11 కేవీ విద్యుత్ లైన్ తెగి పడి ఉండగా శ్రీను గమనించ లేదు. ఫెన్సింగ్‌కు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తండావాసులు అక్కడకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మధ్యాహ్నం వేళ విద్యుత్ లైన్ తెగిపడగా సిబ్బంది సరిచేయలేదన్నారు. వారి నిర్లక్ష్యంతోనే శ్రీను మృతి చెందాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment