విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
ములుగు: నాణ్యమైన విద్యనందించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు కలెక్టరేట్‌లో క్వాల్ కామ్ కంపెనీ, ట్రాన్స్‌ఫాం స్కూల్స్ యాజమాన్యం తరఫున 9, 10వ తరగతుల్లో ఇంగ్లిష్, గణితం, సైన్స్ విభాగాల్లో విద్యాబోధన చేపట్టే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించగా మంత్రి ముఖ్యఅతిఽథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి శిక్షణ తరగతుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విషయాలు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలన్నారు. క్వాల్ కామ్, ట్రాన్స్‌ఫాం స్కూల్స్ స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రంలోనే మొదటిసారి కలెక్టర్ కృషితో మారుమూల ములుగు జిల్లాను ఎంచుకోవడం గొప్ప విషయమన్నారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణ శిబిరంలో ములుగు మండలంలోని బండారుపల్లి, మదనపల్లి, వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్‌నగర్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీహెచ్. మహేందర్‌జీ, ప్రోగ్రాం డైరెక్టర్ శ్రద్ధ ఝా, హెడ్ ప్రోగ్రాం, క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ నేహా రాణా, డీఈఓ పాణిని, లీడర్‌షిప్, కమ్యూనిటీ ప్రోగ్రాం మేనేజర్ హితేశ్‌దశభయ, టెక్నికల్ ప్రాజెక్టు ఆఫీసర్ మిహిర్ పాండా తదితరులు పాల్గొన్నారు.
అర్ధనారీశ్వర స్వరూపాలు ట్రాన్స్ జెండర్లు
ట్రాన్స్‌జెండర్లు అర్థనారీశ్వర స్వరూపాలని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైత్రి ట్రాన్స్ ఉమెన్ క్లినిక్‌ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లాకు చెందిన తొమ్మిది మందికి ఐడీకార్డు, సర్టిఫికెట్‌ను అందించారు. ఆర్థిక పునరావాస పథకం కింద వందశాతం సబ్సిడీపై ఇద్దరికి రూ. 50వేలు స్వయం ఉపాధికి అందించారు. అంతకుముందు ఐటీడీఏ తరఫున మంజూరైన ఆరు 108 వాహనాలను ప్రారంభించారు. డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, డీడబ్ల్యూఓ శిరీష, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, స్టాటికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, మేనేజర్ మహేందర్ పాల్గొన్నారు.
మంత్రి ధనసరి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment