బోసిపోయిన చిరునవ్వులు
లోకం పోకడలు తెలియని పాలబుగ్గల చిన్నోడి చిరునవ్వులు బోసిపోయాయి. వెచ్చని తల్లిఒడిలో జోలపాట వినాల్సిన వయసులో.. నిండు నూరేళ్లు నిండాయి. వీధిలో ఆడుకుంటూ.. ఎడ్లబండి చక్రం కింద నలిగిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. గుండెలవిసేలా విలపించిన వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. వారి రోదనలు చూసి బంధుమిత్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరిపెడ రూరల్: మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని గుర్రప్పతండాకు చెందిన బానోతు లచ్య, సునీత దంపతుల కుమారుడు బానోతు ప్రణయ్ తేజ్ (4) ఆదివారం వీధిలో ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో ఇంటి పక్కన ఉండే హళావత్ సిరి ఎడ్ల బండి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తూ బాలుడు ఆడుకుంటున్న వీధి వద్దకు వచ్చి ఆగింది. ఈక్రమంలో బాలుడు చక్రం మీదుగా ఎండ్ల బండి ఎక్కడానికి ప్రయత్నించాడు. బండి ఒక్కసారిగా ముందుకు కదలడంతో బాలుడు చక్రం కింద పడ్డాడు. ఈక్రమంలో చక్రం అతడిపై నుంచి వెళ్లింది. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బాలుడి మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రణయ్ తేజ్ మరిపెడలోని రత్న స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు. మరిపెడ ఏఎస్సై మంగ్యానాయక్ సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని మహబూబాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
ఎడ్ల బండి చక్రాల కింద పడిన బాలుడు
చికిత్స పొందుతూ మృతి
గుర్రప్పతండాలో
విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment