రోడ్డు భద్రత..అందరి బాధ్యత
హన్మకొండ : రోడ్డు భద్రత..అందరి బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శుక్రవారం రాంనగర్‌లోని హనుమకొండ డిపోలో వరంగల్ రీజియన్ స్థాయి రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ రీజియన్‌లోని 9 డిపోల నుంచి ముగ్గురి చొప్పున సీనియర్ డ్రైవర్లను ఎంపిక చేసి ప్రశంసపత్రం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సమావేశానికి పోలీసు కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా, 40–50 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయన్న విషయాన్ని గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని సీపీ కోరారు. ట్రాఫిక్ కూడళ్లలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను మాట్లాడుతూ..ప్రతి డ్రైవర్ ఒత్తిడి లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలను నివారించి, ఆర్టీసీ సంస్థ మరింత సురక్షితమని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ అంటే సురక్షిత ప్రయాణమనే నమ్మకం ఉందని..ఇదే నమ్మకంతో సురక్షిత డ్రైవింగ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సమావేశంలో ట్రెయినీ ఐపీఎస్ మన్నన్ భట్, ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్లు కేశరాజు భానుకిరణ్, మాధవరావు, డిపో మేనేజర్లు భూక్యా ధరంసింగ్, వంగల మోహన్ రావు, వి.జ్యోత్స్న, రవిచంద్ర, ప్రసన్నలక్ష్మి, వి.పద్మావతి, ఇందు, శివ, స్వాతి, పర్సనల్ ఆఫీసర్ పి.అర్పిత, అసిస్టెంట్ మేనేజర్లు, సెఫ్టీ డ్రైవింగ్ ఇన్స్‌స్ట్రక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ
డ్రైవింగ్ చేయాలి
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
Comments
Please login to add a commentAdd a comment