నిరుద్యోగులకు ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ
వరంగల్ : గ్రామీణ నిరుద్యోగ యువకులకు ఉచిత, ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు అర్హత, ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్‌ఎస్‌ఆర్ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకంలో యువతకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. బేసిక్ కంప్యూటర్స్ (డాటా ఎంట్రీ ఆపరేటర్), కంప్యూటర్ హార్డ్‌వేర్ (ఇంటర్), అకౌంట్ అసిస్టెంట్, ట్యాలీ (బీకాం), ఆటోమొబైల్, 2 వీలర్ సర్వీసింగ్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ (పదో తరగతి), ఎలక్ట్రిషియన్–డొమెస్టిక్, సోలార్ సిస్టమ్స్ ఇన్‌స్టలేషన్, రిపేర్ (టెన్త్, ఐటీఐ) కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించబడుతుందన్నారు. 18–30ఏళ్ల వయస్సు కలిగిన గ్రామీణ అభ్యర్థులు అర్హులని తెలిపారు. అడ్మిషన్లు 3వ తేదీ (సోమవారం) నుంచి స్వీకరిస్తారని ఇతర వివరాలకు 91339 08000, 91339 08111, 91339 08222, 99484 66111 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
రైల్వే జనరల్
ఇన్‌స్టిట్యూట్ తనిఖీ
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్‌ను దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ (సీపీఓ) వెల్ఫేర్ జయశంకర్ చౌహన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చౌహన్ ఇనిస్టిట్యూట్‌లోని బిలియర్డ్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, జిమ్, గ్రంథాలయం, కమ్యూనిటిహాల్‌ను సందర్శించారు. ఇనిస్టిట్యూట్ నిర్వాహణ చాలా బాగుందని అభినందించినట్లు ఇనిస్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ తెలిపారు. కార్యక్రమంలో రైల్వే ఈఎల్‌ఎస్ సీనియర్ డీఈఈ ప్రశాంత కృష్ణసాయి, ఏపీఓ ఆర్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్లు భిక్షపతి, సరళామాధవి, సీహెచ్ సంధ్య, ఎం.రాజయ్య, గిరిమిట్ల రాజేశ్వర్, సిబ్బంది రిటైర్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
‘ఐక్య ఉద్యమాలతోనే రాజ్యాధికారం’
హన్మకొండ : ఐక్య ఉద్యమాలతోనే రాజ్యాధికారం సాధించుకుంటామని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ కొంగర వీరస్వామి, ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో 13 రోజులుగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బీసీ ఆజాదీ సైకిల్ యాత్ర శుక్రవారం రాత్రి హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈయాత్రకు బీసీ కుల, వృత్తి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ ఉద్యమానికి ఊపిరిలా నిలుస్తున్న ఉద్యమకారులకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత బీసీలందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైకిల్ యాత్ర సారథులు బత్తుల సిద్ధేశ్వర్, చాపర్తి కుమార్, బీసీ సంఘాల నాయకులు డాక్టర్ కూరపాటి రమేశ్, గొల్లపల్లి వీరస్వామి, డాక్టర్ చంద మల్లయ్య, సిలువేరు శంకర్, దిడ్డి ధనలక్ష్మి, తాటికొండ సద్గుణ, నరహరి, నవ్య, సతీశ్, శోభారాణి, కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment