కేయూ రిజిస్ట్రార్‌గా రామచంద్రం | - | Sakshi
Sakshi News home page

కేయూ రిజిస్ట్రార్‌గా రామచంద్రం

Published Sat, Feb 1 2025 1:54 AM | Last Updated on Sat, Feb 1 2025 1:54 AM

కేయూ రిజిస్ట్రార్‌గా రామచంద్రం

కేయూ రిజిస్ట్రార్‌గా రామచంద్రం

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా దూరవిద్యాకేంద్రం పొలిటికల్‌ సైన్స్‌ విభాగం ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రంను నియమించగా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ప్రణయ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇన్నాళ్లు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి పదవీ ముగియడంతో రామచంద్రంను నియమించారు. ఈమేరకు వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి ప్రొఫెసర్‌ రామచంద్రంకు శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు.

33ఏళ్ల అనుభవం..

అధ్యాపకుడిగా కొనసాగుతున్న రామచంద్రం పర్యవేక్షణలో ఆరుగురు పరిశోధకులు డాక్టరేట్లు, నలుగురు పరిశోధకులు ఎంఫిల్‌ పట్టా పొందారు. దూరవిద్యకేంద్రంలో ప్రొఫెసర్‌గా ఉంటూ రిజిస్ట్రార్‌ పదవిలో నియమితులైన వారిలో ప్రొఫెసర్‌ రామచంద్రం రెండో వ్యక్తి. గతంలో దూరవిద్యాకేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తూ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావు కేయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

పాలన పదవులు ఇలా..

కేయూ దూరవిద్యా కేంద్రం జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి సుమారు 20 ఏళ్లుగా ఎమ్మెస్సీ సైకాలజీ విభాగం అధిపతిగా కొనసాగుతూనే ఇతర పాలన బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, కేయూ అభివృద్ధి అధికారిగా, పొలిటికల్‌ సైన్స్‌ విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేయూ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్‌గా, సైకాలజీ విభాగం అధిపతిగా, యూనివర్సిటీ సీడీసీ డీన్‌గా, విశ్వవిద్యాలయం విద్యాకళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించి, సంవత్సరం పాటు ఈ పదవిలో ఉంటారు. రామచంద్రం ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ విరమణ పొందాల్సిండేది. కానీ ప్రభుత్వం ప్రొఫెసర్ల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచడంతో ఆయన మరో ఐదేళ్లకుపైగా సర్వీస్‌లో ఉండబోతున్నారు.

1991లో దూరవిద్య కేంద్రంలో నియమితులై..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సర్వాపూర్‌ గ్రామానికి చెందిన రామచంద్రం ఉస్మానియా యూనివర్సిటీలో 1989లో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, 1991లో ఓయూలో బీఈడీ పూర్తిచేశారు.1992లో మధురై కామరాజ్‌ యూనివర్సిటీలో ఎంఈడీ, 2004లో ఎమ్మెస్సీ సైకాలజీ తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఓయూలో 1992లో పొలిటికల్‌ సైన్స్‌విభాగంలో ఎంఫిల్‌, 1999లో ఓయూ నుంచే పీహెచ్‌డీ పూర్తిచేసి డాక్టరేట్‌ సాధించారు. అలాగే కాకతీయ యూనివర్సిటీలోని విద్యావిభాగంలో 2009లో డాక్టరేట్‌, 2012లో తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో సైకాలజీ విభాగంలో డాక్టరేట్‌ను సాధించారు. కేయూ దూరవిద్యాకేంద్రంలో ఎస్‌డీఎల్‌సీఈ పొలిటికల్‌ సైన్స్‌ విభాగం 1991లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమాకం అయి అసోసియేట్‌, అనంతరం ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement