No Headline
సాక్షి, మహబూబాబాద్: బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కౌన్సిల్ సభ్యుల పేర్లు ప్రకటించిన బీజేపీ రాష్ట్ర కమిటీ మహబూబాబాద్ జిల్లా కమిటీని ప్రకటించకుండా హోల్డ్‌లో పెట్టింది. అయితే రెండో జాబితాలో జిల్లా కమిటీ పేర్లు ప్రకటిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా.. మొదటి జాబితాలో ఎంపిక చేయకపోవడంపై జిల్లాలో చర్చగా మారింది.
క్షేత్ర స్థాయిలో పరిశీలన..
పార్టీ నిబంధనలు, కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల మాదిరిగానే మహబూబాబాద్ జిల్లా కమిటీ నియమించేందుకు పార్టీ పెద్దలు కసరత్తు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే జనవరి 22న జిల్లాలో పర్యటించిన పరిశీలకులు నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేశారు. పార్టీ 11 మండలాల అధ్యక్షులతో పాటు కౌన్సిల్ సభ్యులు, పార్టీ ముఖ్యులు, సీనియర్ నాయకులు మొత్తం 45 మందితో మాట్లాడి జిల్లా అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని అభిప్రాయాలు సేకరించారు. అదేవిధంగా ఈనెల ఒకటో తేదీన జిల్లా ఎన్నికల పరిశీలకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డికి వల్లభనేని వెంకటేశ్వరు, యలమంచలి వెంకటేశ్వర్లు, యాప సీతయ్య, కాపరబోయిన సత్యనారాయణ, మాదవపెద్ది శశివర్ధన్ రెడ్డి తమ విన్నపాన్ని మన్నించి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే సోమవారం బీజేపీ రాష్ట్ర కమిటీ విడుదల జాబితాలో మహబూబాబాద్ జిల్లా లేకపోవడంతో చర్చగా మారింది.
రెండు వర్గాలుగా చీలిక..
ఇప్పటికే రాష్ట్రమంతటా బీజేపీ పుంజుకుంటుంటే.. మానుకోటలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని రాష్ట్ర పార్టీ చెబుతోంది. పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఎంపికై న అధ్యక్షుడే ఈ ఏడాది కూడా ఉంటారని ఒక వర్గానికి చెందిన నాయకులు చెబుతుంటే.. లేదు లేదు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని మరో వర్గం చెబుతోంది. పార్టీ నిబంధనల మేరకు ప్రస్తుత అధ్యక్షుడు పనిచేశారని, అధ్యక్షుడిని మార్చవద్దని బీజేపీలోని ఒక వర్గం రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులతో కూడా చెప్పించి ప్రస్తుత అధ్యక్షుడు వైవీ రావునే కొనసాగించేలా ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ప్రస్తుత అధ్యక్షుడు నాయకులను కలుపుకొని పోవడం లేదని, గతంలో పలువురు సీనియర్ నాయకులను అవమానపర్చారని, కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు విఫలయత్నం చేసిన సంఘటనలు ఉన్నాయని మరో వర్గం చెబుతోంది. ఈమేరకు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిని మార్చి కొత్త వారికి అవకాశం కల్పించాలని పార్టీలోని పలువురు సీనియర్ నాయకులతోపాటు, జాతీయస్థాయిలో పరిచయాలు ఉన్న నాయకులు పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆ పార్టీ సీనియర్ నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా కలిసి అధ్యక్షుడిని మారిస్తేనే పార్టీ బలోపేతం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో రెండుగా చీలిని మహబూబాబాద్ బీజేపీని ఏకతాటిపై నడిపించే నాయకుడి కోసం వెతుకుతున్నారా.. లేక కాస్త ఆలస్యం చేసైనా.. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడికే మళ్లీ పగ్గాలు అప్పగిస్తారా అనేది జిల్లాలో చర్చగా మారింది.
మరింత ఆలస్యం!
హోల్డ్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక
రెండుగా చీలిన కమలనాథులు
పదవికోసం రాష్ట్రస్థాయిలో పైరవీలు
ఎటూ తేల్చని రాష్ట్ర కమిటీ
Comments
Please login to add a commentAdd a comment