రోడ్డు ప్రమాదంలో సైట్ ఇంజినీర్ దుర్మరణం
● గొల్లచర్లలో ఘటన
డోర్నకల్: రోడ్డు ప్రమాదంలో ఓ సైట్ ఇంజినీర్ దుర్మరణం చెందాడు. ఈఘటన మండలంలోని గొల్లచర్ల శివారు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లి గ్రామానికి చెందిన తాటికొండ రాజేశ్(28) డోర్నకల్‌లో జరుగుతున్న అమృత్ ఓవర్‌హెడ్ నిర్మాణ పనుల వద్ద సైట్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై మహబూబాబాద్ నుంచి డోర్నకల్‌కు వస్తుండగా గొల్లచర్ల సబ్ స్టేషన్ మలుపు వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన పడింది. ఈ ఘటనలో రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునే సమయానికి మృతి చెందాడు. పోలీసులు రాజేశ్ మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డోర్నకల్ సీఐ బి.రాజేశ్ తెలిపారు.
మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
● కాంగ్రెస్ పార్టీలో విలువ ఉండడం లేదన్న వీడియో వైరల్
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ మాజీ సర్పంచ్ అందె సత్యనారాయణ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన చికి త్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం సత్యనారాయణ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కాగా, మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఆత్మహత్యాయత్నానికి ముందు రికార్డు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాంగ్రెస్ గెలుపు తర్వాత పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యం ఉందని, ముప్పై ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న తన లాంటి నాయకులు, కార్యకర్తలకు విలువ లేదని వీడియోలో సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వీడియోలో వెలి బుచ్చారు. తన ఆత్మహత్యతోనైనా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని సత్యనారాయణ పేర్కొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాత్రం వీడియోలో సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండించారు.
నేడు రెడ్ రిబ్బన్ క్లబ్‌ల ప్రారంభం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్‌ఎస్ ) ఆధ్వర్యంలో మంగళవారం రెడ్‌రిబ్బన్ క్లబ్‌లు ప్రారంభించనున్నట్లు కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు సెనేట్ హాల్‌లో హెచ్‌ఐవీ, ఎస్‌టీఐపై జిల్లా స్థాయి అవగాహన నిర్వహించనున్నామని తెలిపారు. వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం తదితరులు పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment