మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఆశప్ప, మాణిక్యమ్మ దంపతులకు ఉష, మంజుల ఇద్దరు కూతుళ్లు. ఉష గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి వరకు చదివి మానేసింది. చిన్నప్పటి నుంచే పొలం పనులకు వెళ్లేది. అయితే వీరి తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో బంధువులు చేరదీసి వరుసకు మామ అయిన వ్యక్తితో పెళ్లి చేశారు. బాబు, పాప పుట్టి అనారోగ్యంతో నెలలు నిండకుండానే మృతిచెందారు.
భర్తకు సైతం మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గ్రామంలో జీవనోపాధి కష్టంగా మారడంతో హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేస్తూ ఒంటరి మహిళగా జీవనం సాగిస్తుంది. పొట్ట చేతపట్టుకొని పట్నం వెళ్లిన ఓ ఒంటరి మహిళ జీవితాన్ని ఒక్కపాట సెన్సేషన్‌గా మార్చేసింది. చిన్నప్పటి నుంచి జానపద పాటలంటే ఉన్న విపరీతమై ఇష్టమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చేలా చేసింది.
‘కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు’ అనే పాటతో రాత్రికి రాత్రి స్టార్ సింగర్‌గా మారింది. పాట రాసి, స్వరం కలిపి ప్రాణం పోసి అచ్చం తెలంగాణ యాస, భాషతో పల్లె జానపదాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ఆ కళాకారిణి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఉష. ఈమె ఈ ఏడాది జూన్ 29న పాట పాడగా ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 26 మిలియన్ల వ్యూస్ అంటే 2.60 కోట్ల మంది చూశారంటే పాట క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు..
తాను వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఆడవాళ్లు పాడుకునే జానపద పాటలను శ్రద్ధగా గమనించి పాడుతూ ఉండేది. గత పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ తీరిక సమయంలో జానపద పాటలు పాడుతూ ఉండేది. యూట్యూబ్‌లో జానపద పాటలకు ఆదరణ పెరగడం చూసి తాను సైతం పాటలు పాడాలనే కోరికతో కొన్ని పాటలు రాసి వీడియోలు చేసింది.
సరైన ఆదరణ రాకపోయినా.. పట్టువిడవకుండా పాటలు రాస్తూ.. ట్యూన్లు కలుపుతూ అవకాశాల కోసం ఎదురుచూసింది. గతంలో జగిత్యాల జోగుల వెంకటేశ్‌తో రెండు పాటలు, గొల్లపల్లి శివన్న సిరిసిల్లతో ఒక పాట పాడింది. ఓ రోజు జానపద పాటల కవర్‌పై హరీశ్ పాటేల్ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి.. తాను జానపద పాటలు రాసి, పాడతానని అవకాశం ఇవ్వాలని కోరింది. ఆయన దగ్గరకు వెళ్లి మూడు పాటలు పాడి వినిపించింది.
ఈ క్రమంలోనే కెమెరా పట్టిన్నడే సీమ దదర సిన్నోడు అనే పాట నచ్చడంతో గజ్వేల్‌లో అమూల్య స్టూడియోలో ఆమె దగ్గర పాడించి జూన్ 29న రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో వస్తున్న సెన్షేషన్ చూసి ఉష రాత్రికి రాత్రి జానపద స్టార్ సింగర్‌గా మారిపోయింది. చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దల వరకు యూట్యూబ్‌లో పాట వింటూ మురిసిపోతున్నారు.
చేయూత ఇవ్వండి..గ్రామంలో రేకుల షెడ్డు ఇల్లు మాత్రమే ఉంది. ప్రభుత్వం నా పరిస్థితిని గుర్తించి గృహలక్ష్మి ఇల్లుతోపాటు జీవనోపాధి కోసం దళితబంధు పథకాన్ని మంజూరు చేయాలి. నాకు జానపద పాటలంటే ఎంతో ఇష్టం. భవిష్యత్‌లో అవకాశం వస్తే సినిమా పాటలు పాడతా. పదేళ్లుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా. కళాభిమానులు నా జానపద పాటలను ఆదరించి చేయూతనివ్వండి. – ఉష, జానపద కళాకారిణి, పెద్దజట్రం
Comments
Please login to add a commentAdd a comment