హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

Published Mon, May 6 2024 2:40 AM

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

కోస్గి: పోరాడి సాధించుకున్న తెలంగాణలో సంక్షేమ పాలన అందించిన ఘనత కేసీఆర్‌దేనని పాలమూర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మాయ మాటలతో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆదివారం రాత్రి స్థానిక శివాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్డు కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పాలమూర్‌ ప్రాజెక్టుతో పాటు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా అభివృద్ధికి ఏ మాత్రం సహకరించలేదన్నారు. పాలమూర్‌లో ఓట్లు అడిగే హక్కు అటు బీజేపీకి, ఇటు ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ పార్టీలకు లేదన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు.. కాంగ్రెస్‌ నాలుగు నెలల పాలనలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్‌ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోస్గి సభలో రేవంత్‌రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. జిల్లాలో పోటీ కేవలం బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యనే ఉందన్నారు. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ను చూసి రేవంత్‌రెడ్డి మండలాల వారీగా పర్యటిస్తున్నారన్నారు. అంతకు ముందు పట్టణంలోని రామాలయం చౌరస్తా నుంచి శివాజీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి వ్యాపారులను కలిశారు. కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ స్పోర్ట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్‌ శ్యాసం రామకృష్ణ, వెంకట్‌నర్సింహులు, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోస్గి కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
Advertisement