ఎస్‌ఎల్‌బీసీకి అధిక ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎల్‌బీసీకి అధిక ప్రాధాన్యత

Published Sat, Sep 21 2024 1:36 AM | Last Updated on Sat, Sep 21 2024 1:36 AM

ఎస్‌ఎల్‌బీసీకి అధిక ప్రాధాన్యత

అచ్చంపేట రూరల్‌: రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఎస్‌ఎల్‌బీసీని నెలవారీగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి శివారులోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్రస్థాయి ఇరిగేషన్‌, విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారు టన్నెల్‌ను పరిశీలించారు. అనంతరం టన్నెల్‌ సమీపంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రావిటీ కెనాల్‌ అని, 4 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమై.. వ్యయం రూ.4 వేల కోట్లకు పెరిగిందన్నారు. తాము చేపట్టిన జలయజ్ఞంలో మిగిలిన 30, 40 శాతం ప్రాజెక్టులన్నింటితో పాటు గత ప్రభుత్వం చేపట్టిన వాటిని సైతం పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రతినెల రూ.14 కోట్లు అవుతాయని ఇరిగేషన్‌ శాఖ అధికారుల అంచనాల మేరకు క్రమం తప్పకుండా నిధులు ఆర్థికశాఖ ద్వారా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక క్యాలెండర్‌ను ఏర్పాటు చేసుకుని టన్నెల్‌ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. టన్నెల్‌ రెండువైపులా ప్రతి నెల 400 మీటర్ల వరకు వెళ్లేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తూనే.. డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను సైతం పూర్తి చేయాలని, భువనగిరి, నియోజకవర్గంలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టు లు, అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని చేపడుతామన్నారు. నల్ల గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి సస్య శ్యామలం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఇతర బ్రాహ్మణ వెల్లేముల, ధర్మారెడ్డి కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, బునియాదిగాని కాల్వలను పూర్తి చేస్తామన్నారు. అలాగే ఆయా ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలకు సైతం ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామన్నారు. నక్కలగండి, ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వంటి వాటికి ఒకే ఫైల్‌లో ప్రతిపాదనలు పంపిస్తే తక్షణమే మంజూరు చేస్తామన్నారు.

రూ.4,400 కోట్లు మంజూరు చేస్తాం..

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులకు సవరించిన అంచనాల ప్రకారం రూ.4,400 కోట్లు పెంచి మంజూరు చేస్తామని ప్రకటించారు. సొరంగం పనుల కోసం అయ్యే ఖర్చును ఏజెన్సీకి సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2027 సెప్టెంబర్‌ 20 నాటికి సాగునీటిని అందిస్తామన్నారు. అలాగే డిండి ప్రాజెక్టుపై ప్రతివారం సమీక్షించాలని ఇరిగేషన్‌ సెక్రటరీని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీతో పాటు డిండి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామెల్‌, బాలునాయక్‌, జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నర్సిరెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ అజయ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ కలెక్టర్లు బదావత్‌ సంతోష్‌, నారాయణరెడ్డి, ఎస్పీలు గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, చంద్రపవార్‌, ఆర్డీఓలు మాధవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

నెరవేరనున్న చిరకాల స్వప్నం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే చిరకాల స్వప్నం నెరవేరనుందన్నారు. ఏఎంఆర్పీ శాశ్వత పరిష్కారం కాదని గతంలోనే తాను గుర్తించానని అందుకే ఎస్‌ఎల్‌బీసీ మాత్రమే శాశ్వత పరిష్కారంగా భావించి 2004 మేనిఫెస్టోలో చేర్పించడం జరిగిందన్నారు. శ్రీశైలం నీరు డెడ్‌ స్టోరేజీకి వెళ్లినప్పటికీ ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు.

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఓవర్‌ ఫ్లో అవుతున్నందున గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లను నింపుకోవచ్చన్నారు.

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఇదివరకే మంజూరై పరిపాలన అనుమతి వచ్చిందని, త్వరలోనే శంకుస్థాపన చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో అవసరం ఉన్న చోట హై లెవెల్‌ బ్రిడ్జిలు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పరిష్కరించాలని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని, కేఎల్‌ఐ కాలువల మరమ్మతు చేపట్టాలని కోరారు.

మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించినమంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement