విద్యాశాఖలో రాజకీయమా?
నారాయణపేట/వనపర్తి: జిల్లా విద్యాశాఖ అధికారుల బదిలీలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాలయాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో సౌకర్యాల విషయంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా డీఈఓలు బాధ్యతతో విధులు చేపట్టాల్సి ఉంది. అయితే నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇటీవల మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఆ మరుసటి రోజు చోటుచేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో డీఈఓను సస్పెండ్ చేయడంతో పాటు.. మరో ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఓ జిల్లా అధికారి పేర్కొన్నారు. కానీ, మూడు రోజులకే సదరు డీఈఓను వనపర్తి, జోగుళాంబ గద్వాల డీఈఓగా బదిలీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోవిందరాజులు అనాసక్తి?
ఇదిలా ఉండగా.. నాగర్‌కర్నూల్ డీఈఓగా విధులు నిర్వహిస్తున్న గోవిందరాజులును మొదటగా నారాయణపే డీఈఓగా బదిలీ చేస్తూ రాష్ట్ర విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా అతను నారాయణపేటకు వచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు మహబూబ్‌నగర్, నారాయణపేట రెండూ ఇస్తే చేస్తానని, లేదంటే డైట్ కళాశాలకు వెళ్లిపోతానంటూ ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. అంతకుముందు రోజు వెలువడిన ఉత్తర్వులో డీఈఓ గోవిందరాజులుకు నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, పలు సమీకరణాల నేపథ్యంలో వనపర్తితో పాటు జోగుళాంబ గద్వాల బాధ్యతలు డీఈఓ అబ్దుల్ ఘనికి కేటాయించి, కేవలం నారాయణపేట బాధ్యతలు గోవిందరాజులుకు కేటాయించారు. ఈ విషయం జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు వద్దకు చేరినట్లు సమాచారం. మొత్తానికి డీఈఓగా గోవిందరాజులు పేట డీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారా లేక అక్కడే ఉండిపోతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
చర్యలు కాదు.. ప్రోత్సాహం
మాగనూరు పాఠశాల ఘటనపై సంబంధిత డీఈఓతో సంజాయిషీ కోరడం.. చర్యలు తీసుకోవటం వదిలేసి వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాకు బదిలీపై పంపించడం ఏమిటనే ప్రశ్నలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు జవాబు చెప్పాల్సి ఉందని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా మంత్రి, వనపర్తి, గద్వాల జిల్లాల ఎమ్మెల్యేలు స్పందించకపోవడంతో విద్యాశాఖలో పనిచేసే అధికారులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థత పాలైన ఘటనపై నైతిక బాధ్యత వహించాల్సిన అధికారిపై చర్యలు తీసుకోకుండా బదిలీ పేరుతో రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించటంతో విద్యాశాఖలో రాజకీయం ఏస్థాయిలో ఉందోనంటూ ఈ అంశం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. విద్యార్థుల అస్వస్థత ఘటనపై సరిగా స్పందించకపోవడం, రెండో రోజూ పురుగుల అన్నం పెట్టేంత పర్యవేక్షణ లోపం కారణంగా డీఈఓ అబ్దుల్ ఘని సస్పెండ్ కాగా.. తిరిగి ఆయనకే రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించడం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమతున్నాయి. అయితే, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల డీఈఓగా గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న గోవిందరాజులును నారాయణపేట జిల్లాకు కేటాయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment