సేవే పరమావధిగా..
ఉమ్మడి రాష్ట్రంలోని ఆలయాల్లో సేవలందిస్తున్న పాలమూరు వాసులు
●
12 ఏళ్లుగా వెళ్తున్నా..
నేను వ్యవసాయంతో పాటు టైలరింగ్ చేస్తా. ఆలయాల్లో సేవ చేయాలనే సంకల్పం ఉండేది. భగవంతుడి కృపతోనే ఈ భాగ్యం దక్కింది. ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడికి వెళ్లి సేవ చేసి వస్తున్నా. ఇప్పటివరకు అన్నవరం, సమ్మక్క సారక్క, శ్రీశైలం, యాదగిరిగుట్ట తదితర ఆలయాల్లో వివిధ రకాల సేవలు చేశా. రోజూ నాలుగు నుంచి ఆరు గంటల వరకు సేవ చేయాల్సి ఉంటుంది. సేవలను బట్టి టైమింగ్స్ ఉంటాయి. 12 ఏళ్లుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.
– స్వాతి, ఉందెకోడు, నర్వ
● ఆధ్యాత్మిక చింతన, సేవాభావమే లక్ష్యంగా... ● మహిళల భాగస్వామ్యమే అధికం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని
ఆలయాల్లో..
భ్రమరాంభిక సేవాసమితి ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో సేవల్లో పాల్గొంటున్నాం. సేవకులు అవసరం ఉన్నప్పుడు ఆలయాల వారు సమాచారం ఇస్తారు. మేము వెంటనే మా వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తాం. ప్రస్తుతం కురుమూర్తి, మన్యంకొండలతో పాటు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో పలువురు సభ్యులు సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు వేల మంది భక్తులు సేవల్లో పాల్గొన్నారు. – మాలె శ్రీరాములు, అధ్యక్షుడు
భ్రమరాంభిక సేవాసమితి, పల్లెగడ్డ, మరికల్
గండేడ్: గుడికి వెళ్లి భజన చేయడమే కాదు.. సేవ చేయడంలోనూ తాము ముందుంటామని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి పాలమూరు వాసులు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో తమకు చేతనైన పని చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు సేవా తత్పరతను చాటుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహమ్మదాబాద్, గండేడ్, మక్తల్, నర్వ, ధన్వాడ, వనపర్తి, దేవరకద్ర, మహబూబ్‌నగర్ తదితర మండలాల వారు అత్యధికంగా సేవల్లో పాల్గొంటున్నారు. భ్రమరాంభిక సేవాసమితిలో ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు మూడు వేల మందికిపైగా సేవకులు నమోదై ఉన్నారు. 20 నుంచి 30 మంది సేవకులు బృందంగా ఏర్పడి ఆలయాల్లో ఒకరోజు మొదలు ఐదు, ఏడు, 15 రోజుల పాటు వివిధ రకాల సేవలు అందిస్తుంటారు. ఆలయాల్లో సేవలకు సంబంధించిన సమాచారాన్ని భ్రమరాంభిక సేవాసమితి వారు ప్రత్యేకంగా రూపొందించిన ‘శ్రీవారి సేవ’ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. ఆసక్తిగల సేవకులు సేవాసమితి వారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం సేవాసమితి వారు ఆయా ఆలయాల వారికి సేవకుల వివరాలు పంపిస్తారు. సేవకులు సొంత ఖర్చులతో ఆలయాలకు వెళ్లగా.. వసతి, భోజన సదుపాయం దేవస్థానం వారు కల్పిస్తారు.
ప్రధాన ఆలయాల్లో..
ఉమ్మడి జిల్లావాసులు ఎక్కువగా తిరుమలలో సేవకు వెళ్తుంటారు. అక్కడ భోజనం వడ్డించడం, హుండీ లెక్కింపు, లడ్డూలు ఇతర ప్రసాదాల ప్యాకింగ్, కూరగాయలు కోయడం, దర్శనానికి వచ్చిన భక్తులను వరుస క్రమంలో పంపించడం, ఆయా ఆలయాలకు సంబంధించిన ఆధ్యాత్మిక పుస్తకాలు విక్రయించడం, పూలదండల తయారీలో సాయం చేయడం వంటి పలురకాల సేవల్లో పాల్గొంటారు. శ్రీశైలం, పుట్టపర్తి, యాదగిరిగుట్ట, మహానంది, భద్రాచలం, విజయవాడ, వేములవాడ, స్వర్ణగిరి, అన్నవరం, బ్రహ్మంగారి మఠం, సమ్మక్క–సారక్క, కొండగట్టు, మంత్రాలయం తదితర ఆలయాల్లోనూ సేవలకు మహిళలు, పురుషులు వెళ్తున్నారు. సేవలకు వెళ్లిన వారికి అక్కడి ఆలయ అధికారులు మొదటి, చివరిరోజు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. దీంతో సేవ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మరికొందరు నేరుగా ఆయా ఆలయాలకు వెళ్లి సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవ కార్యక్రమాల్లో అత్యధికంగా మహిళలే పాల్గొంటున్నారు. పురుషులు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటున్నారు.
జన్మజన్మల పుణ్యఫలం..
నేను ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నా. మొదట మా వీధిలో ఉన్న వారు తిరుపతిలో సేవకు వెళ్తే వారివెంట వెళ్లా. తర్వాత భ్రమరాంభిక సేవాసమితి ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా సేవలకు వెళ్తున్నా. ఇప్పటి వరకు యాగంటి, భద్రాచలం, శ్రీశైలం, అరుణాచలం, మంత్రాలయం, తిరుపతి తదితర ఆలయాల్లో సేవచేశా. ఆలయాల్లో సేవ చేసే అవకాశం లభించడం జన్మజన్మల పుణ్యఫలం.
– కవిత, దేవరకద్ర
సేవ చేయడం సంతృప్తినిస్తుంది..
దైవసన్నిధిలో సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. తిరుపతిలో సేవకు రెగ్యులర్‌గా వెళ్తున్నా. హుండీ లెక్కింపు, భక్తులను క్యూలైన్‌లలో పంపించడం, పూలు అల్లడం తదితర సేవల్లో పాల్గొన్నా. మొదటి, చివరిరోజు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. స్వామివారిని తనివితీరా చూసేందుకు గర్భగుడి ఎదుట సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టం. సేవ అనంతరం ప్రత్యేక దర్శనం ఇవ్వడంతో పాటు ప్రసాదం కూడా ఇస్తారు. ఎప్పుడు అవకాశం వచ్చినా వెళ్తున్నా.
– దిడ్డికాడి సునీత, మహమ్మదాబాద్
Comments
Please login to add a commentAdd a comment