‘మాజీ సర్పంచ్ ఆత్మహత్యపై స్పందించాలి’
పాలమూరు: సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఘటనపై స్పందించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ ఘటనకు కారణం సీఎం కుటుంబ సభ్యులే అంటూ నోట్ రాసిన కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆమె నివాసంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహారాష్ట్రలో మోదీపై ఉన్న విశ్వాసంతోనే ప్రజలు ఎన్‌డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారని, అన్ని రంగాల్లో కూడా మహారాష్ట్ర దేశానికి వెన్నెముక వంటిందని, అలాంటి రాష్ట్రంలో బీజేపీ గ్రేట్ విక్టరీ సాధించడం గర్వకారణమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీ కాలికి గజ్జెకట్టుకొని ప్రచారం చేశారని, తెలంగాణ సీఎం వెళ్లి పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇచ్చినా.. తెలంగాణ మోడల్ అంటూ చేసిన ప్రచారం బోగస్ అని తేలిపోయిందని, తెలంగాణలో శఠగోపం పెట్టారని అక్కడి ప్రజలు గుర్తించి తీర్పు ఇచ్చారన్నారు. మహారాష్ట్రలో గెలుపు కోసం కాంగ్రెస్ చేసిన కుట్రలు పనిచేయలేదని, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే సెంటిమెంట్ రాజకీయం చేశారని, కానీ ఆ ప్రాంత ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ దేశంలో ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రసంగాలు చేశారని దుయ్యబట్టారు. అంతకు ముందు మహారాష్ట్రలో ఎన్‌డీఏ మిత్రపక్షం గెలుపును పురస్కరించుకొని ఎంపీ నివాసం ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు ఎంపీ డీకే అరుణకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment