ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జాప్యం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే నెమ్మదిగా కొనసాగుతుంది. ఇందిరమ్మ యాప్ సర్వర్ సమస్యతో దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆలస్యమవుతోంది. గతేడాది నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల 12 నుంచి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఎంపిక కోసం సర్వే చేపడుతున్నారు. ఒక్కో కార్యదర్శికి 200 నుంచి 500 దరఖాస్తులు సర్వే చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. జిల్లాలో లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 30 శాతం వరకు పరిశీలన పూర్తయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఉన్నవారే మళ్లీ..
పలు గ్రామాల్లో కొందరికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ లేవని పేర్కొంటూ ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేకు వెళ్లిన పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తుదారులకు సొంతిల్లు ఉన్నట్లు గుర్తిస్తున్నారు. మరికొందరు సొంతింట్లో ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నామని కార్యదర్శులతో చెబుతున్నారు. ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ఫొటో అప్‌లోడ్ చేస్తే కొత్త ఇల్లు మంజూరు కాదంటూ కార్యదర్శులపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి ఇల్లు లేదని వివరాలు నమోదు చేయించుకుంటున్నట్లు తెలుస్తుంది.
15 నుంచి 20 నిమిషాలు..
దరఖాస్తుదారుల ఇంటి వివరాలు నమోదు చేసేందుకు సర్వర్‌లో నెలకొన్న సమస్యతో పంచాయతీ కార్యదర్శులు ప్రారంభంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వర్ స్లోగా మారడంతోపాటు ఇంటర్‌నెట్ సరిగా లేకపోవడంతో దరఖాస్తుదారుల ఇంటి వివరాలు నమోదు చేసి ఫొటోలను అప్‌లోడ్ చేయడానికి ఆలస్యమవుతుంది. ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలు, ఫొటోలను నమోదు చేసేందుకు సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని కార్యదర్శులు చెబుతున్నారు.
సర్వర్ సమస్యతో ఇబ్బందులు
వివరాల నమోదులో ఆటంకాలు
నెలాఖరు వరకు గడువు పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment