ఆస్పత్రుల్లో జలగలు! | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో జలగలు!

Published Fri, Dec 27 2024 1:31 AM | Last Updated on Fri, Dec 27 2024 3:46 PM

రోగికి వైద్యంపై చివరి వరకూ సస్పెన్స్‌

రోగికి వైద్యంపై చివరి వరకూ సస్పెన్స్‌

ప్రైవేట్‌ హాస్పిటళ్లలో దోపిడీ పర్వం

యాజమాన్యాల ఇష్టారాజ్యం

రోగికి వైద్యంపై చివరి వరకూ సస్పెన్స్‌

చివరలో హైదరాబాద్‌కు తరలించాలంటూ హడావుడి

జనరల్‌తో పాటు ‘ఆరోగ్యశ్రీ’ రోగుల నుంచీ అదనపు వసూళ్లు

పట్టించుకోని వైద్యారోగ్య శాఖ అధికారులు

● కాలేయ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిని అతడి కుటుంబసభ్యులు ఇటీవల పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్‌ ఆపరేషన్‌ చేయాలని సూచించగా.. ఆ వ్యక్తిని జాయిన్‌ చేశారు. తెల్లారి ఆపరేషన్‌ కాగా.. ఆ తర్వాత మూడు రోజుల పాటు చికిత్స అందించారు. ఐసీయూలో ఉన్న అతడిని చూసేందుకు కుటుంబసభ్యులు ఏ ఒక్కరిని అనుమతించలేదు. చివరకు నాలుగో రోజు సీరియస్‌గా ఉందని.. హైదరాబాద్‌కు తరలించాలని.. బిల్లు కడితే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. బిల్లు పూర్తిగా కట్టే వరకు డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత హడావుడిగా ఆ రోగిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతిచెందాడు. అక్కడ అసలు విషయం తెలిసింది. ముందు నుంచీ సదరు రోగి కండిషన్‌ బాగాలేదని. ఇప్పటికే రూ.3 లక్షల వరకు ఖర్చయిందని.. వాళ్లు ముందుగానే అన్ని సంతకాలు చేయించుకున్నారని.. ఏం చేసినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన ఓ వ్యకి ఇటీవల వెన్నెముకకు సంబంధించిన వ్యాధితో తెలంగాణ చౌరస్తా సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఏం పర్వాలేదు.. ఆరోగ్య శ్రీ ఉందని, ఉచితంగా చికిత్ర చేస్తామని... ఓ వైద్యపరికరాన్ని (ఇంప్లాంట్‌) అమర్చాలని డాక్టర్‌ చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చేది తక్కువ నాణ్యత ఉంటుందని.. మంచి ఇంప్లాంట్‌ పెట్టాలంటే మీకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పడుతుందని వివరించి.. ఒప్పందం చేసుకున్నారు. ...పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే దానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. వైద్యారోగ్య శాఖ పట్టింపులేని తనంతో ప్రైవేట్‌ హాస్పిటళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో వైద్యసేవల పేరిట దోపిడీకి పాల్పడుతున్న పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాకంపై ‘సాక్షి’ ఫోకస్‌.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి వీలున్న మేరకు దోచుకోవాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రైవేట్‌ హాస్పిటళ్ల నిర్వాహకులు. దగ్గు, జలుబు వంటి చిన్నపాటి ఇబ్బందులతో వచ్చినా.. పరీక్షల పేరిట అందిన కాడికి దండుకుంటున్నారు. పలు రకాల ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన రోగి పరిస్థితి ఏమిటో చెప్పకుండా.. ఐసీయూలో ఉన్నారని.. ఇన్ఫెక్షన్‌ వస్తుందని.. సహాయకులను పంపించకుండా.. రోజుల తరబడి వైద్యం పేరిట లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. అంతేకాదు చివరకు చేతులెత్తేస్తూ.. మరో ఆస్పత్రికి రెఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

ఇవి మిస్టరీనే..

● నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడు నెలల క్రితం ఓ గర్భిణి ప్రసవం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది. డెలివరీ సమయంలో గర్భిణి మృతి చెందింది. ఆ సమయానికి వైద్యురాలు లేకపోయినా.. ఆమెను అడ్మిట్‌ చేసుకున్నారని.. డాక్టర్‌ వేరే చోట ఉండి, కింది స్థాయి సిబ్బందితో ఫోన్‌న్‌లో టచ్‌లో ఉంటూ డెలివరీకి ప్రయత్నించారని.. దీంతో మృతి చెందిదంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

● జోగుళాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన కవిత శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతూ ఇటీవల గద్వాలలోని శివ బాలాజీ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చింది. శస్త్ర చికిత్స ద్వారా ముక్కులో పెరిగిన కండను తీసేయాలని డాక్టర్‌ సూచించగా అడ్మిట్‌ అయింది. శస్త్ర చికిత్స సమయంలో మహిళ పరిస్థితి విషమంగా ఉందంటూ.. మెరుగైన చికిత్స కోసం ఏపీలోని కర్నూలుకు తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం మహిళ మృతి చెందింది. ఈ సంఘటనపై గద్వాల పోలీస్‌స్టేషన్‌లో సదరు వైద్యుడిపై కేసు నమోదైంది.

● గద్వాల మండలానికి చెందిన ఓ గర్భిణి జూన్‌ 9న ప్రసవం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఈ క్రమంలో బాలింత పరిస్థితి విషమంగా ఉందంటూ మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రెఫర్‌ చేశారు. అక్కడి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

● గద్వాల పట్టణానికి చెందిన ఓ గర్భిణిని కుటుంబ సభ్యులు ప్రసవం కోసం అనంత మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశారు. అయితే సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇంప్లాంట్‌ పేరిట అదనపు వసూళ్లు..

ముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారితో పాటు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు ఇతరత్రా ఫ్యాక్చర్‌ అయిన వారు చికిత్స కోసం ప్రధానంగా ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా శస్త్ర చికిత్స చేస్తారని.. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే మెరుగైన వైద్యం అందిస్తారనే ఉద్దేశంతో పేద, మధ్య తరగతులకు చెందిన వారు ఎక్కువగా ప్రైవేట్‌ హాస్పిటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆసరాగా చేసుకుని దండుకుంటున్నాయి. ఫ్యాక్చర్‌ అయినప్పుడు అమర్చే ఇంప్లాంట్స్‌ పేరిట రోగులను మాయం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇంప్లాంట్‌ నాణ్యతగా ఉండదని.. విదేశాల నుంచి నాణ్యతతో కూడిన ఇంప్లాంట్‌ వేస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. అంతే కాదు పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ కింద చేరిన రోగులను రెండు రోజుల్లోనే డిశ్చార్జి చేసి.. వారం, పది రోజుల వరకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చామంటూ మందుల, బెడ్‌ ఇతరత్రా చార్జీలు వేసి ప్రభుత్వానికి బిల్లులు సమర్పిస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement