జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఈ నెల 1 నుంచి నెలరోజుల పాటు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ విజయేందిర అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవ నిర్వహణపై శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో రవాణ, ఆర్టీసీ, విద్య, పోలీస్ శాఖల సమన్వయంతో ఆయా కార్యక్రమాలను విజయవంతం చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని పంచవటి ఉన్నత పాఠశాల, జడ్చర్లలో స్వామి నారాయణ్ గురుకుల పాఠశాలలో రోడ్డు భద్రతకు సంబంధించి అవేర్నెస్ పార్కు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో జడ్చర్ల పోలేపల్లి సెజ్ ఎస్‌కేబీఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక ఇన్‌స్పైర్ సైన్స్ ప్రదర్శన సందర్భంగా రవాణా, నేషనల్ హైవే, ఆర్టీసీ తదితర శాఖల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతామన్నారు. అంతకు ముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత మహోత్సవంలో అన్ని శాఖలను భాగస్వామ్యం చేయాలని, జిల్లా స్థాయి మొదలుకొని గ్రామస్థాయి వరకు అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో కొత్త మెనూ అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించిందని, వీటిని పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ రోడ్డు భద్రత మాసోత్సవం వాల్‌పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్, ఆర్టీసీ ఆర్‌ఎం సంతోష్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ దేశ్యానాయక్, ఎంవీఐ రఘు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment