బాబోయ్.. చలి
●
జిల్లాలో రాత్రిపూట
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
అప్రమత్తం చేశాం..
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో వైద్యాధికారులతోపాటు ఆస్పత్రి వైద్యులను అప్రమత్తం చేశాం. కొత్త రకం వైరస్ ఇంకా రాష్ట్రంలోకి రాలేదు. అయినప్పటికీ కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాగే ఇప్పుడు కూడా పాటించాలి. ప్రస్తుతం చలికాలం నేపథ్యంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు, దగ్గు, శ్వాస కోశ సమస్యలు ఉంటాయి. ఈ క్రమంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. వేడి ఆహారం, వేడి నీళ్లు తీసుకోవాలి. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
– కృష్ణ, డీఎంహెచ్‌ఓ
పాలమూరు: జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున చలి తీవ్రంగా పెరగడంతో జిల్లావాసులు ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి కనిపించింది. రాజాపూర్‌లో అత్యల్పంగా 9.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం, తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తుండగా.. ఉదయం వేళ పొగమంచు కమ్మేస్తోంది. ఫలితంగా రహదారులపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరగడంతో దీర్ఘకాలిక రోగులతోపాటు పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. మారిన వాతావరణం వల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధ సమస్యలు ముసురుతున్నాయి. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.
విజృంభిస్తున్న వ్యాధులు
ఒకవైపు చలి తీవ్రత అధికంగా ఉంటే.. మరోవైపు కొత్తరకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కొత్త రకం ప్లూలో దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాశ తీసుకోవడంలో ఇబ్బంది కన్పిస్తుంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకై టిస్, నిమోనియాకు దారి తీయవచ్చు. ప్రస్తుతం వాతావరణ మార్పులు, ఇతర కారణాలతో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు ఇళ్లలో ఉండాలని, జనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. బీపీ, షుగర్, మధుమేహం, క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు వృద్ధులు, గర్భిణులు, చంటిపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పండుగల నేపథ్యంలో రద్దీగా ఉన్న బస్సులు, రైళ్లలో ప్రయాణించడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, తప్పక మాస్క్ ధరించాలని పేర్కొంటున్నారు.
వ్యాయామానికి వెళ్లే ముందు
ఎక్కువ మంది వ్యాయామం అంటే ఉదయపు నడకకే ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు, మధ్య వయస్కులు, వృద్ధులు ఎక్కువగా వెళ్తుంటారు. అయితే ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య పొగ మంచులో కాలుష్యం కలిసి ఉంటుంది. ఈ సమయంలో నడకకు వెళ్లేవారు దాన్ని పీల్చేవారు శ్వాసకోశ వ్యాధులు బారినపడే అవకాశం ఉంది. ఈ మూడు నెలలు ఉదయం 7 గంటలు దాటిన తర్వాత వాకింగ్ చేయడం ఉత్తమం. కుదరకపోతే సాయంత్రం వేళలో చేసుకోవాలి. తప్పదు అనుకొనే వారు ముఖం, ముక్కు, చెవులు కప్పి ఉంచే టోపీలు, దుస్తులు, స్వెటర్లు ధరించాలి.
నవాబ్‌పేటలో ఉదయం 8 గంటల
సమయంలో కమ్మేసిన మంచు
తేదీ కనిష్ట గరిష్ట
03.01.25 11.6 35.5
04.01.25 9.0 33.8
05.01.25 8.4 34.5
రాబోయే నాలుగు రోజుల్లో
మరింత తగ్గుదల
శ్వాసకోశ, ఆస్తమా
కేసులు పెరిగే అవకాశం
రోగులు వస్తున్నారు..
జనరల్ ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి కొంత జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు జనరల్ మెడిసిన్ విభాగానికి వస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకు చల్లని గాలులకు బయట తిరగకూడదు. జనరల్ మెడిసిన్ ఓపీ పెరిగితే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తాం.
– సంపత్‌కుమార్‌సింగ్,
జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
నిర్లక్ష్యం చేయొద్దు..
చలిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. చలి వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. గొంతునొప్పి, చలిజ్వరం, ఆస్తమా, బ్రాంకై టీస్, నిమోనియా వ్యాధుల ముప్పు పొంచి ఉంది. దుమ్ము నోట్లోకి వెళ్లడం వల్ల పలు రకాల ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి. గాలిలో చల్లని తేమ వల్ల చిన్నారులకు త్వరగా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత్తలు తగ్గుతున్న సమయంలో ఇంట్లో వేడి పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
– యశ్వంత్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్
Comments
Please login to add a commentAdd a comment